పోలేపల్లిలో కొనసాగుతున్న ’రంగుల రగడ’
దుద్యాల్: మండల పరిధిలోని పోలేపల్లి గ్రామ పంచాయతీ భవనానికి వేసిన ‘రంగుల రగడ’ కొనసాగుతోంది. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలా రంగులు వేసిన పంచాయతీ భవనంలో తాము ప్రమాణ స్వీకారం చేయబోమని సోమవారం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రంగులు మార్పిస్తామని చెప్పిన ఎంపీడీఓ హామీతో పంచాయతీ భవనం బయటే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందిన వ్యక్తి జాతీయ జెండాను అవమానించేలా పంచాయతీ కార్యాలయానికి రంగులు వేయించారని మండిపడ్డారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినా మండల అధికారులు పట్టించుకోవడం లేదని, త్వరలోనే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఉప సర్పంచ్ ఏదుల అనురాధ, వార్డు సభ్యులు విశాల్, బాల్‌రాజ్, రాములు, శారద, పద్మమ్మ, రేణుక, బీఆర్‌ఎస్ నాయకులు పుర్ర రాఘవేందర్, బుగ్గప్ప, తూర్పు శ్రీనివాస్, సుదర్శన్, కృష్ణయ్య, దశరత్, మల్లికార్జున్, విజయ్‌కుమార్, చంద్రప్ప తదితరులు తెలిపారు.


