కొత్త పంచాయతీ సర్పంచ్!
● రెండేళ్ల క్రితం నూతన జీపీగా దీప్లానాయక్ తండా
● మొదటిసారి ఎన్నికలు
● ఎన్నిక కానున్న తొలి ప్రథమ పౌరుడు
కుల్కచర్ల: దీప్లానాయక్ తండా ప్రజల సర్పంచ్ కల ఎట్టకేలకు నెరవేరనుంది. రెండేళ్ల క్రితం ఈ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. మొదటి సారి ఎన్నికలు జరగనున్నాయి. తొలి సారిగా ప్రథమ పౌరుడిని ఎన్నుకోనున్నారు. ఆ సమయం రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సాహంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పరిగి రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దీప్లానాయక్ తండాను ఎస్టీ మహిళకు కేటాయించారు. దీంతో పలువురు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సాల్వీడు గ్రామ పంచాయతీలో అనుబంధ గ్రామంగా ఉన్న ఈ తండాకు జూలై 15, 2024లో పంచాయతీ హోదా లభించింది. నాటి నుంచి ఇన్‌చార్జ్ అధికారుల పాలన సాగుతోంది. తండాలో 555 మంది జనాభా, 398 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 203 మంది, మహిళలు 195మంది ఉన్నారు.
ఎవరైనా మొదటి సర్పంచే
నూతన జీపీ దీప్లానాయక్ తండాలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఇక్కడి నుంచి తండాకు చెందిన దీప్లానాయక్ 1985లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అదనంతర ఎన్నికల్లో సాల్వీడు జీపీని ఎస్టీకి కేటాయించలేదు. దీంతో ఆ సామాజిక వర్గం నుంచి ఎవరూ సర్పంచ్‌గా ఎన్నిక కాలేదు. ప్రస్తుతం దీప్లానాయక్ తండా కొత్త గ్రామపంచాయతీగా మారడంతో తాండవాసులే సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మొదటి సారి ఎన్నికలు కావడంతో యువత పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటి వరకు సర్పంచ్ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు, వార్డు స్థానానికి ఆరుగురు నామినేషన్లు వేశారు. నేటితో గడవు ముగియనుంది. ఒకరు లేదు ఇద్దరు సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


