‘పంచాయతీ’ సందడి
షాబాద్: పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ఏ నలుగురు కలిసినా సర్పంచ్, వార్డు సభ్యుల పోటీపైనే చర్చ జరుగుతోంది. నేటితో మూడో విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో వర్గాల వారీగా మంతనాలు జరుపుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ సర్పంచ్‌గా గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. రిజర్వేషన్లు మినహాయిస్తే జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు చెందిన యువత పోటీలో ఉండడంతో ఓటరు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇస్తారో తెలియని పరిస్థితి.
యువత ఆసక్తి
ఎన్నికల బరిలో నిలిచేందుకు యువతరం ముందుకు వచ్చింది. గతంలో పెద్దలకు అవకాశం ఇస్తూ వెంటతిరిగిన యువకులు.. పంచాయతీల మార్పునకు అంటూ ప్రథమ పౌరుడి బరిలో నిలుస్తున్నారు. బంధుమిత్రులు, యువజన సంఘాల సభ్యుల మద్దతు కూడగట్టుకుంటూ సామాజిక మాధ్యమాల్లో సాధరణ ఎన్నికలను తలపిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఎన్నికల ప్రచారంతో పల్లెల్లో కోలాహలం
బరిలో నిలిచిన యువతరం
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు


