నిబంధనలు తప్పనిసరి
శంకర్‌పల్లి: ఎన్నికల నియమాలను ప్రతిఒక్కరూ కచ్చితంగా పాటించాలని శంకర్‌పల్లి ఎంపీడీఓ వెంకయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు గాను అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. సభలు, సమావేశాలు, ఊరేగింపుల కోసం అభ్యర్థులు సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు.
27 పంచాయతీలకు 75 మంది పోటీ
తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మండలంలో 33 పంచాయతీలకు 6 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 27 జీపీల్లో 75 మంది సర్పంచు అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎంపీడీఓ విశ్వప్రసాద్ తెలిపారు. 290 వార్డులకు 96 ఏకగ్రీవం కాగా.. 194 వార్డులకు 426 మంది బరిలో ఉన్నారు.
పెద్దేముల్లో 100 మంది
పెద్దేముల్ మండలంలో 38 గ్రామాలకు 5 ఏకగ్రీవమయ్యాయి. 33 పంచాయతీలకు 100 మంది సర్పంచు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 308 వార్డుల్లో 74 ఏకగ్రీవంకాగా.. 234కు 529 బరిలో ఉన్నారని ఎంపీడీఓ రతన్‌సింగ్ తెలిపారు.
ఎన్నికల విధుల నుంచి మినహాయించండి
అనంతగిరి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులకు గర్భిణులు, పాలిచ్చే తల్లులు, అంగవైకల్యం, అనారోగ్యంతో బాధపడేవారితో పాటు.. ఉద్యోగ, ఉపాద్యాయులు, కింది స్థాయి సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం కోరారు. గురువారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల విధులు సజావుగా నిర్వహించడానికి పోలింగ్ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాములు ఉన్నారు.


