నేను చనిపోతున్నా.. పాప జాగ్రత్త
● భార్యకు వీడియో పంపి ఫోన్ స్విచాఫ్ చేసిన భర్త
● ఆచూకీ దొరక్క కుటుంబ సభ్యుల ఆందోళన
షాద్‌నగర్ రూరల్: ‘మనీలా నన్ను క్షమించు.. నాకు ఏ పనీ చేయాలనిపించడం లేదు. నేను చనిపోతున్నా.. నా చావుకు ఎవరూ కారణం కాదు.. పాపను జాగ్రత్తగా చూసుకో’అంటూ ఓ వ్యక్తి భార్యకు వీడియో పంపి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు.. అతడి ఆచూకీ లభించక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని రాఘవేంద్రకాలనీకి చెందిన సుందరాచారి, మనీల దంపతులు. సుందరాచారి ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళుతున్నానంటూ బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఓ చెరువు వద్ద ఓ వీడియో రికార్డు చేసి మనీలకు పంపించాడు. పాపను జాగ్రత్తగా చూసుకో, అప్పులు ఇచ్చిన వాళ్లు నన్ను క్షమించాలి, నా భార్యాపిల్లలను ఇబ్బంది పెట్టొద్దు అని అందులో పేర్కొన్నాడు. వీడియోలో కనిపించిన ముళ్లపొదలతో నిండిన చెరువు ఎక్కడ ఉంది, ఆ తరువాత కనిపించిన రైల్వే ట్రాక్ ఎక్కడ ఉంది..? అనే విషయం తెలియకపోవడం, సుందరాచారి ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై సుందరాచారి భార్య మనీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


