పక్కాగా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పక్కాగా ఏర్పాట్లు

Dec 4 2025 9:15 AM | Updated on Dec 4 2025 9:15 AM

పక్కా

పక్కాగా ఏర్పాట్లు

పక్కాగా ఏర్పాట్లు శాంతియుత పోలింగ్‌కు

పోక్సో కేసులపై సీరియస్‌గా వ్యవహరిస్తాం

ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలి

వికారాబాద్‌: ‘గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు.. ఇవి నేరుగా ప్రజలచే ఎన్నుకోబడే ఎన్నికలు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీ ఎన్నికలు ఎంతో కీలకం.. అందుకే ఎలాంటి అవకతవకలు.. ఇబ్బందులకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్‌ నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం.. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన వాతావరణం కల్పిస్తున్నాం.. ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించాలి’ అని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న ఆమె ‘సాక్షి’తో పలు అంశాలు పంచుకున్నారు. పంచాయతీ ఎన్నికల సంసిద్ధతలో భాగంగా లిక్కర్‌, బెల్టు షాపుల కట్టడి, రౌడీ షీటర్ల బైండోవర్లు, లైసెన్స్‌ గన్ల స్వాధీనం తదితర అంశాలపై స్పందించారు. జిల్లాలో ఆమె గుర్తించిన సమస్యలు.. వాటి పరిష్కారానికి తీసుకోబోయే చర్యలు ఆమె మాటల్లోనే..

ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు

శాంతియుతంగా పోలింగ్‌ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. సమావేశాలు, ర్యాలీలు ఉంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. లేందటే కేసులు నమోదు చేస్తాం. జిల్లాకు వచ్చే అదనపు బలగాలు.. స్థానిక పోలీసులను సమన్వయం చేస్తూ భద్రతా ఏర్పాట్లు చూస్తున్నాం. ప్రతి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో పోలీసులను ఉంచి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాం. మద్యం వాయిలేషన్‌కు సంబంధించి ఇప్పటి వరకు 104 కేసులు నమోదు చేసి 919 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇప్పటి వరకు 279 మందిని బైండోవర్‌ చేశాం. వీరిలో 44 మంది రౌడీషీటర్లు ఉన్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 242 లైసెన్స్‌డ్‌ తుపాకులు ఉండగా 123 స్వాధీనం చేసుకున్నాం. మిగతావి బ్యాంక్‌ సెక్యూరిటీ తదితర అత్యవసర సేవల్లో ఉన్నవారి వద్ద ఉన్నాయి. డబ్బు, మద్యం రవాణాలను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో నాలుగు అంతర్రాష్ట్ర, ఎనిమిది అంతర్‌ జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇవి 24 గంటల పాటు పని చేస్తాయి. మరో 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం.

సివిల్‌ డిస్పూట్స్‌పై ప్రత్యేక దృష్టి

భూముల ధరలు పెరగడంతోనే సివిల్‌ తాగాదాలు.. నేరాలకు దారి తీస్తున్నాయి. వికారాబాద్‌ గ్రామీణ జిల్లా అయినందున ఎక్కువగా రైతులే ఉన్నారు. సివిల్‌ డిస్పూట్స్‌ విషయంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ఏదైనా సమస్య వస్తే ముందుగా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలి.. అక్కడ స్పందించకుంటే.. నేరుగా నన్ను కలవొచ్చు.. ప్రధానంగా ఎర్రమట్టి, ఇసుక, కలప అక్రమ రవాణ, ఓవర్‌లోడ్‌ తదితర వాటిపై దృష్టి పెడుతున్నాం. యువత డ్రగ్స్‌ కల్చర్‌కు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపడతాం. నేరాల నియంత్రణకు సీసీ టీవీలు ఏర్పాటు చేయిస్తాం.. ఉన్నా వాటిని సక్రమంగా వినియోగించేలా చూస్తాం. సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటినిపై దృష్టి సారిస్తాం.. ప్రజలతో పాటు మా సిబ్బందిని అప్రమత్తం చేస్తాం. వ్యవస్థల మధ్య గ్యాప్‌ లేకుండా చర్యలు తీసుకుంటాం. నేరస్తులు, రిపిటెడ్‌ క్రైమ్‌, తదితర అంశాలపై సీరియస్‌గా వ్యవహరిస్తాం. సాధారణ ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూనే క్రిమినల్స్‌ విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తామని ఎస్పీ స్నేహమెహ్ర తెలిపారు.

ఈ ప్రాంతంలో పోక్సో కేసులు ఎక్కువగా నమోదువుతన్నట్టు గుర్తించాం.. ఈ కేసుల్లో నేరస్తులను కఠిన శిక్షలు పడేలా చూడటంతో పాటు బాలికలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. వారికి గుడ్‌ టచ్‌ ఏదో..? బ్యాడ్‌ టచ్‌ ఏదో తెలియజేస్తాం. వారి కోసం పని చేసే అన్ని వ్యవస్థలు సక్రమంగా సాగేలా చర్యలు తీసుకుంటాం. భరోసా సెంటర్లు, మహిళా పోలీస్‌ స్టేషన్‌, పోలీస్‌ స్టేషన్లు, సీసీఎస్‌, సైబర్‌ క్రైమ్‌ వింగ్‌ తదితర వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేసేలా చూస్తాం.. ట్రాఫిక్‌ సమస్య అనేది లా అండ్‌ ఆర్డర్‌తో పాటు సామాజిక సమస్య కూడా. దీన్ని రెండు కోణాల్లో చూడాలి. ఒకటి పార్కింగ్‌ చేయటానికి స్థలం లేనిచోట వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బంది కలగనంత వరకు కొంత సానుకూల దృక్ఫథంతో వ్యవహరిస్తాం. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న వాటిని హాట్‌ స్పాట్లగా గుర్తిస్తున్నాం.. హైవేలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.. నివారణకు ప్రత్యేక కార్యాచరణ మొదలు పెట్టాం. పొగమంచు నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. రోడ్లను ఆక్రమించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని సీరియస్‌గా తీసుకుంటాం.

అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి

పోక్సో కేసులపై దృష్టి సారిస్తాం

సివిల్‌ తగాదాలు, ఇల్లీగల్‌ వ్యవహారాలపై నిఘా పెడతాం

సైబర్‌ నేరాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం

కిందిస్థాయి అధికారులు స్పందించకుంటే నేరుగా కలవొచ్చు

‘సాక్షి’తో ఎస్పీ స్నేహ మెహ్ర

పక్కాగా ఏర్పాట్లు 1
1/1

పక్కాగా ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement