తాండూరు: తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడ కాసులు ఇవ్వనిదే ఏ ఫైలూ కదలడం లేదు. మూడేళ్ల వ్యవధిలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఏసీబీకి చిక్కి సస్పెన్షన్‌కు గురైనా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. 2022 డిసెంబర్ నెలలో సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించిన జమిరొద్దీన్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి రెండేళ్లు ఉద్యోగానికి దూరమయ్యారు. ఈ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలో ఉంది. ఈ ఏడాది మార్చి నెలలో సబ్ రిజిస్ట్రార్ పుర్య పనితీరు సరిగ్గా లేదని ఉన్నతాధికారులు హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. తర్వాత అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సాయికుమార్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. నాలుగు నెలల ఆయన నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఈ క్రమంలో ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన పవన్, ఫసియొద్దీన్ పక్షం రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 240 డాక్యుమెంట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఉన్నతాధికారులు గుర్తించి వారిద్దరినీ సస్పెండ్ చేశారు. తాజాగా ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సాయికుమార్ 11 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు పథకం వేశారు. ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.2 వేలు డిమాండ్ చేశారు. రూ.16,500 లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి అధికారులు తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ప్రత్యేక దృష్టి సారించి అధికారుల అవినీతికి చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
చేతివాటం ప్రదర్శిస్తున్న ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు
మూడేళ్ల వ్యవధిలో ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు
తాజాగా రూ.16,500 లంచం తీసుకుంటూ పట్టుబడిన సాయికుమార్


