మెరుగైన వైద్యం మన బాధ్యత
కొడంగల్ రూరల్: రోగులకు మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత అని ఇందుకోసం సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి సూచించారు. బుధవారం మండలంలోని అంగడిరాయిచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రి రికార్డులు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవీంద్రయాదవ్, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భూషరా ఫాతిమా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీ సందర్శన
దౌల్తాబాద్: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని బుధవారం జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది రిజిస్టర్, మందుల నిల్వలు, డెలివీరీ కేసుల వివరాల గురించి వైద్యాధికారిని ప్రియదర్శిని అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. పీహెచ్‌సీని 24 గంటల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని స్థానికులు కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. రోజుకు 80 నుంచి 100 మంది ఓపీ వస్తుంటారని వైద్యాధికారిణి తెలిపారు. ఆమె వెంబడి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్‌యాదవ్, సిబ్బంది రఫీ, తదితరులు ఉన్నారు.
అందుబాటులో ఉండాలి
దుద్యాల్: ఆస్పత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌ఓ సువర్ణకుమారి సూచించారు. బుధవారం మండలంలోని హకీంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ వందన, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి
పలు పీహెచ్‌సీల సందర్శన


