ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

Dec 4 2025 9:11 AM | Updated on Dec 4 2025 9:13 AM

చన్గోముల్‌ ఎస్‌ఐ భరత్‌రెడ్డి

పూడూరు: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చన్గోముల్‌ ఎస్‌ఐ భరత్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం నుంచి మండల పరిధిలోని 32 పంచాయతీల్లో మూడో విడత నామినేషన్‌ల ప్రక్రియ జరుగుతుందన్నారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద గొడవలకు దిగినా, అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్‌ మీడియాల్లో రెచ్చగొట్టేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే శిక్షార్హులు అవుతారన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు.

గృహిణి ఆత్మహత్య

మీర్‌పేట: గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నూజివీడుకు చెందిన ఎం.సురేష్‌, శబరి (27)లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం బడంగ్‌పేట సాయినగర్‌కు వచ్చి నివాసముంటున్నారు. శబరి గృహిణి కాగా, భర్త పహాడీషరీఫ్‌లోని స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం భార్యాభర్తల మధ్య చిన్న తగాదా జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చర్చలు సఫలం..

ఏకగ్రీవం విఫలం

తాండూరు రూరల్‌: ఏకగ్రీవం చేయాలని నిర్ణయించిన మండలంలోని చంద్రవంచ గ్రామస్తులకు భంగపాటు తప్పలేదు. గ్రామంలో 1,300 మంది జనాభా, 903 ఓటర్లు, 8 వార్డులున్నాయి. ప్రస్తుతం సర్పంచ్‌ పదవి జనరల్‌కి వచ్చింది. దీంతో గ్రామ పెద్దలు కూర్చొని ఏకగ్రీవం చేయాలని తీర్మానించారు. ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఉప సర్పంచ్‌తో పాటు వార్డులను కేటాయించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పటేల్‌ సుదర్శన్‌రెడ్డి సర్పంచ్‌గా ఏకగ్రీవం చేయాలని అనుకున్నారు. 29వ తేదీన ఆయన సర్పంచ్‌గా నామినేషన్‌ వేశారు. అంతకు ముందే సుదర్శన్‌రెడ్డి అన్న మాణిక్‌రెడ్డి కొడుకు విజయ్‌కుమార్‌రెడ్డి 27వ తేదీన నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే విజయ్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ విత్‌డ్రా చేసుకుంటే తన బాబాయ్‌ సుదర్శన్‌రెడ్డి ఏకగ్రీవం అవుతారని గ్రామస్తులు భావించారు. కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత చెప్పినా వినలేదు. దీంతో చేసేదేమి లేక ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయం కుటుంబాన్ని చీల్చిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

42 వార్డు మెంబర్లు ఏకగ్రీవం

ధారూరు: మండల వ్యాప్తంగా 42 వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయ్యారు. బుధవారం 10 గ్రామ పంచాయతీల్లో ఒక్కోక్కరే నామినేషన్‌ వేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో అల్లాపూర్‌ జీపీలో ఐదుగురు, అవుసుపల్లి, నాగ్‌సాన్‌పల్లి జీపీల్లో ఎనిమిది మంది చొప్పున, హరిదాస్‌పల్లి జీపీలో నలుగురు, కొండాపూర్‌ఖుర్దు, రాజాపూర్‌ జీపీల్లో ఒకరు చొప్పున, కుమ్మర్‌పల్లి, మోమిన్‌కాలన్‌ జీపీల్లో ఇద్దరు, మోమిన్‌ఖుర్దు జీపీలో ముగ్గురు, పీసీఎంతండాలో 7 మంది వార్డుమెంబర్లు ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవం అయ్యాయి.

కుల ధ్రువీకరణ పత్రం లేక

ధారూరు జీపీలోని 12వ వార్డు ఎస్టీ జనరల్‌కు రాగా రాథోడ్‌ పాండు, రాథోడ్‌ రమేశ్‌ నామినేషన్లు వేశారు. రాథోడ్‌ పాండు దరఖాస్తు ఫారానికి కులం సర్టిఫికేట్‌ జతచేయలేదు. స్క్రూట్నీలో బయటపడగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పాండుకు అరగంట టైం ఇచ్చి సర్టిఫికేట్‌ సమర్పించాలని సూచించారు. సకాలంలో అతను పత్రం తీసుకు రాకపోవడంతో తిరస్కరించారు. దీంతో రాథోడ్‌ రమేశ్‌ నామినేషన్‌ మిగిలింది. ఇక అతను ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లే.

సైబర్‌ నేరాలతో మోసపోవద్దు

అనంతగిరి: సైబర్‌ నేరాలతో మోసపోవద్దని వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్‌ యువతకు సూచించారు. ఈ మేరకు బుధవారం విశ్వభారతి డిగ్రీ కళాశాలలో ఫ్రాడ్‌కా ఫుల్‌ స్టాప్‌ కార్యక్రమం నిర్వహించారు. సెల్‌ఫోన్‌లలో అనవసరమైన లింకులు ఓపెన్‌ చేయవద్దని సూచించారు. సైబర్‌ నేరాలపై వెంటనే 1930కు కాల్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ భీంకుమార్‌ , కళాశాల ప్రిన్సిపల్‌ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్‌  ఉల్లంఘిస్తే చర్యలు 1
1/2

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

ఎన్నికల కోడ్‌  ఉల్లంఘిస్తే చర్యలు 2
2/2

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement