నగల కోసం వృద్ధురాలి హత్య
● వీడిన కేసు మిస్టరీ
● వివరాలు వెల్లడించిన ఎస్పీ స్నేహమెహ్ర
అనంతగిరి: నగల కోసం వృద్ధురాలిని హత్యచేసిన నిందితులను బుధవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పూడూరు మండలం చన్గోముల్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు బేగరి రాములమ్మ కనిపించడం లేదంటూ గత నెల 21న ఆమె కొడుకు నర్సింలు ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా 24న గ్రామంలోని ఓ పాడుబడ్డ ఇంటిలో నుంచి దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా గోనె సంచిలో మూటగట్టిన రాములమ్మ శవం కుళ్లిన స్థితిలో ఉంది. ఆమె మెడలో బంగారు గుండ్లు, చేతికి ఉన్న వెండి గాజులు కనిపించలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా అనుమానితుడైన బెల్కటూరి నరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. మెహర్, భూతుల్(అక్కచెల్లెళ్లు) అనే ఇద్దరితో కలిసి వృద్ధురాలి బంగారు, వెండి ఆభరణాలు కాజేయాలని పథకం పన్నారు. 18న మధ్యాహ్నం 12.30గంటలకు మృతురాలు బేగరి రాములమ్మ ఎప్పటిలాగే సమీపంలోని మెహర్ ఇంటికి వచ్చింది. అపుడు మెహర్ నరేష్‌కు ఫోన్ చేయగా వాళ్ల ఇంటికి వచ్చాడు. అక్కడ ముగ్గురూ కలిసి వృద్ధురాలి గొంతునులిమి చంపి, బంగారు గుండ్ల దండ, ఆరు వెండి గాజులు, ముక్కు పుడక తీసుకున్నారు. అనంతరం శవాన్ని గోనె సంచిలో కుక్కి, పాడుబడ్డ ఇంట్లో శవాన్ని పడేశారు. నేరం అంగీకరించడంతో నిందితులను కోర్టులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన అడిషనల్ ఎస్పీ రాములునాయక్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ భరత్‌రెడ్డి, ఇతర సిబ్బందిని ఆమె అభినందించారు.


