అనారోగ్యంతో పీఏసీఎస్ డైరెక్టర్ మృతి
ధారూరు: అనారోగ్యంతో ధారూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ పి.రవీందర్ బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సోసైటీ సీఈఓ నర్సింహులు, జిల్లా దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ప్రజాసేవలో
పట్లూరి ఫ్యామిలీ
● అరవై ఏళ్లుగా రాజకీయక్షేత్రంలో
ఆ కుటుంబం
● ప్రస్తుత బరిలో మూడోతరం
అభ్యర్థిని
కేశంపేట: మండలంలోని కొత్తపేటలో ఓ కుటుంబం దాదాపు అరవై ఏళ్లుగా ప్రజలకు రాజకీయ సేవలందిస్తోంది. స్థానిక సంస్థలు ఏర్పాటైన నాటి నుంచి 2006 వరకు పట్లూరి కుటుంబం ప్రజాసేవలో భాగమైంది. గ్రామ మొదటి సర్పంచ్‌గా పట్లూరి శివలింగప్ప ప్రస్థానం ప్రారంభించి పాలనలో తమదైన ముద్ర వేయడంతో ఏళ్లుగా గ్రామస్తులు వారికే పట్టం కట్టారు. 2006 వరకు శివలింగప్ప వారసులు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించగా.. ఆ తరువాత రిజర్వేషన్ మారింది. దీంతో ఆ కుటుంబం మద్దతుతో 2006–2011 వరకు గ్రామ సర్పంచ్‌గా వేరే వారు పనిచేశారు. 2011లో మళ్లీ జనరల్ స్థానంలో పోటీ చేసి ఆ కుటుంబ సభ్యుడైన పట్లూరి జగదీశ్వర్ 2016 వరకు గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. తరువాత గ్రామంలోని సమీకరణాల కారణంగా ఐదేళ్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పట్లూరి జగదీశ్వర్ సతీమణి హైమావతి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గ్రామస్తుల తీర్పుపై మండలవాసులు ఉత్కంఠగా ఉన్నారు.


