ధారూరు జీపీలో రాస్నం ఓటర్లు!
● ఆందోళన వ్యక్తంచేస్తున్న స్థానికులు
● ఈసీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి
ధారూరు: ధారూరు గ్రామ పంచాయతీలో దశాబ్దాల కాలంగా దొంగ ఓట్లు రాజ్యమేలుతున్నాయని స్థానికులు మండిపడ్డారు. ఈ విషయమై అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘంతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ధారూరు జీపీలోని రెండో వార్డులో యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన 21 మంది పేర్లు నమోదై ఉన్నాయి. పదేళ్లుగా ఇవి ఇలాగే కొనసాగుతున్నాయి. వీరిని ఎవరు చేర్చారో అర్థంకాక రాజకీయ పార్టీల నేతలు తల పట్టుకుంటున్నారు. గతంలో జరిగిన గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ధారూరుకు వచ్చిన వీరు యథేచ్ఛగా ఓటు వేసి వెళ్లారని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వీరి వేసిన ఓట్లు వార్డు సభ్యుడితో పాటు సర్పంచ్ అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేశాయన్నారు. ఈ విషయమై తహసీల్దార్ సాజిదాబేగంను వివరణ కోరగా విషయం తన దృష్టికి కూడా వచ్చిందని తెలిపారు. రాత పూర్వకంగా ఫిర్యాదు వస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.


