హత్య కేసులో నిందితులపై పీడీ యాక్టు నమోదు
మలక్‌పేట: పట్టపగలు దారుణహత్యకు పాల్పడిన కేసులో ఆరుగురు నిందితులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు ప్రయోగించినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిందితులపై పీడీ యాక్టు నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. గత జులై 25న మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని, శాలివాహననగర్ పార్కు వెస్ట్‌సైడ్ గేట్ వద్ద సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, గిరిజన నాయకుడు కేతావత్ చందు రాథోడ్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో నిందితులైన ఉప్పల్ భగాయత్‌కు చెందిన దొంతి రాజేష్ అలియాస్ రాజన్న, సరూర్‌నగర్‌కు చెందిన కుంబ ఏడుకొండలు, జగ్గయ్యపేటకు నివాసి ఆత్మకూరి శ్రీను, అడ్డగూడూరుకు చెందిన కందుకూరి ప్రశాంత్, నెల్లూరు జిల్లాకు చెందిన అర్జున్ జ్ఞానప్రకాశ్, రాంబాబులపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు.


