ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి అదృశ్యం
పహాడీషరీఫ్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి ప్రాంతానికి చెందిన దుర్గా భవానికి, ఏడాదిన్నర క్రితం పినిశెట్టి రాజేశ్‌కుమార్(35)తో వివాహం జరిగింది. వీరు జల్‌పల్లిలోని శ్రీరాం కాలనీలో నివాసం ఉంటున్నారు. చిట్‌ఫండ్ వ్యాపారం చేసే రాజేశ్‌కుమార్‌కు డబ్బులు ఇచ్చే వారు సకాలంలో ఇవ్వకపోవడంతో, చిట్టీ ఎత్తిన వారికి సమయానికి నగదు ఇవ్వలేక ఒత్తిడికి గురవుతున్నాడు. ఇతని భార్య పురుడు పోసుకునేందుకు పుట్టింటికి వెళ్లగా, బావమరిది దూసనపూడి వెంకటేశ్ కొంతకాలంగా బావతో కలిసి ఉంటున్నాడు. ఇదిలా ఉండగా నవంబర్ 29న శ్రీశైలం వెళ్లి వస్తానని బావమరిదికి చెప్పి వెళ్లిన అతడు ఎంతకీ తిరిగి రాలేదు. ఒత్తిడి భరించలేకే ఎక్కడికో వెళ్లిపోయి ఉంటాడని భావించిన వెంకటేశ్ సోమవారం పహాడీషరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌లో లేదా, 87126 62367 నంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.
సిమెంట్ ట్యాంకర్ బోల్తా
శంకర్‌పల్లి: సిమెంటు లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్(లారీ) బోల్తా పడిన సంఘటన శంక్‌పల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు నుంచి సిమెంటు లోడుతో వస్తున్న ట్యాంకర్ శంకర్‌పల్లి మీదుగా బాచుపల్లి వెళ్తోంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఎల్వర్తి మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడటంతో, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం పోలీసులు క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు.
కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్య
కొందుర్గు: కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ముట్పూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పార్వతమ్మ(55)కు శోభారాణి, మంజుల ఇద్దరు కూతుళ్లు. పిల్లల చిన్నతనంలోనే పార్వతమ్మ భర్త కిష్టయ్య మృతిచెందాడు. దీంతో అన్నీ తానై కష్టపడి ఇద్దరినీ పెంపి, పోషించి వివాహాలు చేసింది. ఇదిలా ఉండగా చిన్న కూతురు మంజుల తన భర్తతో ఏర్పడిన విభేదాలతో ఇటీవలే విడాకులు తీసుకుంది. దీంతో పార్వతమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ఈనెల 28న చిన్న కూతురు మంజుల చెక్కలోనిగూడలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఒంటరిగా ఉన్న పార్వతమ్మ పెద్ద కూతురు శోభారాణికి ఫోన్ చేసి, మంజుల గురించి బాధపడింది. అనంతరం మూడు రోజుల తర్వాత పార్వతమ్మ ఇంట్లో నుంచి దుర్వాసన రావడం, ఆమె ఫోన్ స్విచాఫ్ ఉండటంతో స్థానికులు శోభారాణికి ఫోన్ చేసి సమాచారం అందించారు. కూతుళ్లు వచ్చి చూడగాఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. పెద్దకూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి అదృశ్యం


