ఇండస్ స్కూల్ వద్ద ఎమ్మెల్యేల ఆందోళన
శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని ఇండస్ ఇంటర్‌నేషనల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బీఆర్‌ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆరోపించారు. అనుమతులు లేకుండా సీజ్ చేసిన ప్రైవేటు బస్సుల్లో విద్యార్థులను తిప్పుతున్నారని, అదే విధంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమీప బంధువు బస్సులకు సంబంధించి రూ.3 కోట్ల మేర బకాయిలు చెల్లించాలని కోరుతూ సోమవారం స్కూల్ వద్ద తమ అనుచరులతో ఆందోళన చేపట్టారు. అనంతరం స్కూల్ డైరెక్టర్ కిరణ్ కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించి, వారితో మాట్లాడారు. ఈ సంభాషణ అంతా వాడివేడిగా జరుగుతున్నా క్రమంలో.. స్కూల్ యాజమాన్యం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఫోన్‌లో సంప్రదించి, ఎమ్మెల్యేలతో మాట్లాడించారు. నగరానికి వచ్చిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందామని కేటీఆర్ సూచించడంతో ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. బయటకు వచ్చిన అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఇండస్ స్కూల్ యాజమాన్యం ఫిట్‌నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తోందని ఆరోపించారు. స్కూల్ యాజమాన్యం ఎమ్మెల్యేలతోనే ఈ విధంగా ప్రవర్తిస్తే, సామాన్య ప్రజలకు ఇంకేలా ఉంటుందని అందోళన వ్యక్తం చేశారు.
కేటీఆర్ సూచనతో వెనుదిరిగిన నేతలు


