గొడవలు చేస్తే కేసులు పెడతాం
సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి
● 71 మంది పాత నేరస్తుల బైండోవర్
తాండూరు రూరల్: స్థానిక ఎన్నికల సమయంలో గొడవలు చేస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం కరన్‌కోట్ ఠాణా సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎక్కడైనా గొడవలు జరిగితే 100కు కాల్ చేయాలని చెప్పారు. రూరల్ పోలీస్ సర్కిల్లో నాలుగు మండలాలు పెద్దేముల్, యాలాల, తాండూరు, బషీరాబాద్ ఠాణాలు కలిపి 71 మంది పాత నేరస్తులు, హత్య కేసుల్లో నిందితులను తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేశామని తెలిపారు.
26 సమస్యాత్మకమైన గ్రామాలు
తాండూరు మండలంలో సంగెంకలాన్, కరన్‌కోట్, మల్కాపూర్, చెంగోల్, సిరిగిరిపేట్, అల్లాపూర్, జినుగుర్తి గ్రామాలు. యాలాలలో అగ్గనూర్, జుంటుపల్లి, దెవనూర్, రాస్నం, కోకట్ గ్రామాలు. పెద్దేముల్లో మంబాపూర్, హన్మపూర్, ఇందూర్, జనగాం, తట్టెపల్లి, పెద్దేముల్, నాగులపల్లి. బషీరాబాద్‌లో దామర్‌చెడ్, నవల్గా, ఎక్మాయి, మైల్వార్, పర్వత్‌పల్లి సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తించామని సీఐ పేర్కొన్నారు.
కఠిన చర్యలు
యాలాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ విఠల్‌రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని చెప్పారు. అనవసర పోస్టులు చేస్తే.. గ్రూపు అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


