లెక్క..కీలకం | - | Sakshi
Sakshi News home page

లెక్క..కీలకం

Dec 2 2025 9:44 AM | Updated on Dec 2 2025 9:44 AM

లెక్క..కీలకం

లెక్క..కీలకం

పంచాయతీ ఎన్నికల వ్యయ పరిమితి ఖరారు

పల్లె పోరులో నోట్ల కట్టల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఇందుకు వ్యయ పరిమితిని విధించడంతో పాటు గ్రామాల్లో ప్రత్యేక యంత్రాంగంతో కూడిన నిఘా ఏర్పాటు చేసింది.

వికారాబాద్‌: రోజురోజుకూ పెరుగుతున్న ఎన్నికల వ్యయాన్ని నియంత్రించడానికి ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. అభ్యర్థులు ఎంత ఖర్చు చేయాలనే విషయంలోనూ స్పష్టమైన పరిమితులు రూపొందించింది. అయితే ఎన్నికల కమిషన్‌ పేర్కొన్న నిబంధనలకు ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చుకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. ఈసీ పరిమితికి మించి అభ్యర్థులు పది నుంచి ఇరవై రెట్లు ఎక్కువ వెచ్చిస్తున్నారు. ధన ప్రవాహ కట్టడికి జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని యంత్రాంగం ప్రత్యేక నిఘా పెడుతోంది. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన నిబంధనలు నవంబర్‌ 27 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే జిల్లాలో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు పకడ్బందీగా వాహనాల తనిఖీ చేస్తున్నారు.

రోజువారీగా లెక్కలు

పోటీ చేసే ప్రతి అభ్యర్థి నామినేషన్ల నుంచి ఎన్నికలయ్యే వరకు ప్రచార కార్యక్రమాల నిమిత్తం ఎంత ఖర్చు చేయాలనే విషయంలో స్పష్టమైన నిబంధనలున్నాయి. ఏయే అవసరాలకు ఎంత ఖర్చు చేయాలనే విషయాలను కూడా స్పష్టీకరించింది. గతంలో ఎన్నికల ఖర్చును మూడు రోజులకు లేదా పోలింగ్‌ పూర్తయిన తరువాత కౌంటింగ్‌ వరకు చూపించే వీలు ఉండేది. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం అభ్యర్థి తాను చేస్తున్న ఖర్చును రోజువారీగా అధికారులకు చూపించాలి. అంతే కాకుండా వివరాలను ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వెబ్‌సైట్‌లో సైతం నమోదు చేయాలని షరతు ఉంది. అదే విధంగా నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తే వాటికి సంబంధించిన వివరాలను కూడా నమోదు చేయాలని అధికారులు పేర్కొంటున్నారు.

నిత్యం దావత్‌లు

ఎన్నికల కమిషన్‌ నిబంధనలతో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని ఆయా పార్టీలు ముందుగానే తమ మద్దతుదారులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఎన్నికల్లో ధన వ్యయాన్ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో కమిషన్‌ నిబంధనలు విధిస్తున్నప్పటికీ అభ్యర్థులు మాత్రం లోలోపల ఖర్చుకు వెనుకాడడం లేదు. జిల్లాలో మొత్తం 594 జీపీలు, 5,058 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తొలి విడతలో 262, రెండో విడతలో 175, మూడో విడతలో 157 జీపీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో నామినేషన్ల పర్వం ముగిసి ప్రచార పర్వానికి తెరలేసింది. ప్రతి నిత్యం వాహనాల ఏర్పాటు, భోజనాలు, మందు, విందు ఖర్చుల పేరిట భారీగానే వెచ్చిస్తున్నారు. ఎంతలేదన్నా ఆయా జీపీల్లో నిత్యం రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

జనాభా ప్రాతిపదికన ప్రచారానికి ఖర్చు

క్షుణ్ణంగా పరిశీలించనున్న అధికారులు

మేజర్‌ జీపీలో సర్పంచ్‌కి రూ.2.5 లక్షలు

చిన్న గ్రామంలో రూ.1.5 లక్షలు

పరిమితి దాటితే వేటే

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థి నేరచరిత్రకు సంబంధించిన వివరాలను నామినేషన్‌తో పాటు పొందుపరచాలి. ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో(మేజర్‌ పంచాయతీ) పోటీ చేసే సర్పంచ్‌ అభ్యర్థులు రూ.2.5 లక్షల వరకు ఖర్చు చేసుకునే వీలుంది. మేజర్‌ పంచాయతీలలో వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు రూ.50 వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఇక ఐదు వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో(మైనర్‌ పంచాయతీలు) పోటీ చేసే సర్పంచ్‌ అభ్యర్థులు రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేసే వెసులుబాటు ఈసీ కల్పించింది. చిన్న పంచాయతీలలో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తే రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఉప సర్పంచ్‌ అభ్యర్థులకు సైతం వార్డు సభ్యుడికి ఉండే నిబంధనలే వర్తిస్తాయి. ఖర్చులు పరిమితి దాటితే వేటు తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement