ఎయిడ్స్‌పై అప్రమత్తత ముఖ్యం
తాండూరు టౌన్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సూచించారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, దిశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు చికిత్సే లేదని, నివారణ ఒక్కటే మార్గమన్నారు. హెచ్‌ఐవీ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ డాక్టర్ స్వర్ణకుమారి, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. అలాగే ఐదు ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయని, రెండు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ చికిత్స కేంద్రాలు కూడా ఉన్నాయన్నారు. హెచ్‌ఐవీ సోకిన ఇద్దరు మహిళలకు సురక్షితంగా ప్రసవం చేశామన్నారు. జిల్లాలో 3,800 మంది హెచ్‌ఐవీకి చికిత్స పొందుతున్నారని, గతేడాదితో పోలిస్తే ఈఏడాది కేసుల సంఖ్య తగ్గిందన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ పట్టణాధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్ కుమార్, ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సమీవుల్లా, శ్రీనివాసులు, దిశా స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ డానియల్, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్


