‘రేడియల్’ రహదారి పనులు షురూ
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 330 అడుగుల రేడియల్ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఓఆర్‌ఆర్ 13 ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాంతం పరిధిలోని మీర్‌ఖాన్‌పేట మీదుగా ఆమన్‌గల్లు మండలం ఆకుతోటపల్లి వరకు దాదాపు 42 కిలోమీటర్ల మేర 330 అడుగుల విస్తీర్ణంతో రహదారిని నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ స్కిల్స్ యూనివర్సిటీ మీదుగా గతంలో నిర్మించిన 200 అడుగుల రహదారి వరకు సుమారు 19.2 కిలోమీటర్ల మేర ఏపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. అక్కడి నుంచి ఆకుతోటపల్లి వరకు 22 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన రహదారి కాంట్రాక్టును ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకుంది. రెండు రోజుల క్రితం నుంచి మీర్‌ఖాన్‌పేట 200 అడుగుల రహదారి నుంచి ఉత్తరం వైపు స్కిల్స్ యూనివర్సిటీ మీదుగా ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ వైపు రహదారి నిర్మాణ పనులను రిత్విక్ సంస్థ ప్రారంభించింది. సోమవారం దక్షిణం వైపు కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎల్‌అండ్‌టీ సంస్థ పనులు మొదలు పెట్టింది. జేసీబీ యంత్రాలతో ప్రస్తుతం రెండు వైపులా భూమి చదును చేసే పనులు చేపట్టారు. టీజీఐఐసీ గతంలో సేకరించిన భూముల నుంచే ప్రస్తుతం పనులు ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీలో ఓవైపు గ్లోబల్ సమ్మిట్ పనులు, స్కిల్స్ యూనివర్సిటీ, ఎఫ్‌సీడీఏ కార్యాలయం నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ప్రస్తుతం రేడియల్ రహదారి నిర్మాణం పనులు షురూ కావడంతో అన్ని వైపుల నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన పనులు వేగాన్ని పుంజుకున్నట్లయింది.


