పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
అనంతగిరి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సోమవారం హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించామని, పరిశీలన కూడా చేస్తున్నామన్నారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు జిల్లాస్థాయి మండల స్థాయిల్లో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ స్నేహమెహ్ర, ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరి, వ్యయ పరిశీలకుడు రమేశ్‌కుమార్, అదనపు కలెక్టర్ సుధీర్, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.


