నేతలకు ఉపసంహరణ పరీక్ష
దౌల్తాబాద్: తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు ఇద్దరికి మించి నామినేషన్లు దాఖలు చేసిన చోట్ల వారిని ఉపసంహరించుకునేలా చేయడం నేతలకు పరీక్షగా మారింది. ఆయా స్థానాల్లో పార్టీ బలపరిచన అభ్యర్థుల నుంచి ముఖ్యనేతలపై ఒత్తిడి తీవ్రమైంది. అధికారపార్టీలో ఈ పోటీ తీవ్రంగా ఉంది. దీంతో పార్టీ ముఖ్యనేతలకు తలనొప్పిగా మారింది. ఎవరిని ఎంపిక చేయాలో ఎవరిని బుజ్జగించాలో తెలియని పరిస్థితి నెలకొంది. అత్యధిక పంచాయతీ స్థానాలు దక్కించుకోవాలనే వ్యూహరచనలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు సమర్థులు, అంగబలం, అర్ధబలం ఉన్న అభ్యర్థుల అన్వేషణలో పడ్డాయి. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలకు సైతం వార్డు స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క పరేషాన్‌లో పడ్డారు.


