ప్రతి‘నోటా’మాట!
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నోటా గుర్తును తొలిసారిగా ప్రవేశపెడుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పైన ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే.. నోటాకు ఓటు వేసే అవకాశం కల్పించింది. దీంతో ఆ గుర్తుపై ప్రజల్లో చర్చ, అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.
దుద్యాల్: శాసనసభ, పార్లమెంటు ఎన్నికలకే పరిమితమైన నోటాను తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ప్రవేశ పెట్టింది. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం ఓటర్లకు కల్పించింది. అయితే తొలి సారిగా అమలు చేస్తున్న దీనిపై గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే.. స్థానిక పోరు గ్రామాల అభివృద్ధికి కీలకం. బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థికి ప్రతి ఓటు ముఖ్యమే. ఒకటి, రెండు ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓటమిని చవిచూసిన సందర్భాలు అనేకం. అయితే ఈ సారి బ్యాలెట్ పేపర్‌లో ఎన్నికల కమిషన్ నోటాకు అవకాశం ఇవ్వడంతో అభ్యర్థుల్లో ఇప్పటి నుంచే వణుకు మొదలైంది.
అవగాహన అవసరం
స్థానిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సామగ్రి రెడీగా ఉంచారు. జిల్లాలోని మండల కేంద్రాలకుతరలించారు. కాగా.. బ్యాలెట్ పత్రంపై నోటా గుర్తును సైతం ముద్రించడంతో.. దీనిపై పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇటీవలే సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలలో నోటా గుర్తుపై ప్రజలకు వివరించారు. గ్రామాల్లో ఎక్కువగా నిరక్షరాశ్యులు ఉండే అవకాశం ఉండటంతో వారికి దీనిపై అవగాహన ఉండదు. కావున నోటా గుర్తుపై అవగాహన అనివార్యం.
తారుమారు
నోటా గుర్తు వలన ఓటర్లు ఇబ్బందిపడే అవకాశాలున్నాయి. అది ఒక అభ్యర్థి గుర్తుగానే భావించి, అవగాహన లేమితో కొందరు దానికి ఓటేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. ఆది నోటా లెక్కలోకి వెళ్తుంది. ప్రస్తుత ఎన్నికల్లో గ్రామాలను బట్టి 300 నుంచి 10 వేల వరకు ఓటర్లు ఉన్న పంచాయతీలు ఉంటాయి. వెయ్యి మంది ఓటర్లు గల జీపీలు 60 శాతానికి పైగా ఉన్నాయి. వార్డుల్లో 50 నుంచి 200లకు పైగా ఓటర్లు ఉంటారు.సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ఒకటి, రెండెంకెల ఓట్ల తేడాతో ఎన్నికయ్యే సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నోటా గురించి.. ఓటర్లకు అవగాహన కల్పించక పోతే.. ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉంటుందని పోటీదారులు భయాందోళన చెందుతున్నారు.
స్థానిక పోరులో నోటాకు చోటు
బ్యాలెట్ పేపర్‌పై గుర్తింపు
గ్రామాల్లో విస్తృతంగా చర్చ
ఓటర్లకు అవగాహన కల్పిస్తే మేలు


