రేపు సామూహిక భగవద్గీత పారాయణం
అనంతగిరి: గీతా జయంతిని పురస్కరించుకొని సోమవారం వికారాబాద్ పట్టణం శివాజీ నగర్ గణేశ్ కట్ట వద్ద సంపూర్ణ భగవద్గీత పారాయణం, గీతాయజ్ఞం నిర్వహించనున్నట్లు గీతావాహిణి అధ్యక్షురాలు టీ శ్రీదేవి సదానందరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్న 12.30గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.
సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
తాండూరు రూరల్: సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థులు వేసే నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి, తిరస్కరణకు గురికాకుండా చూడాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆర్‌ఓలకు సూచించారు. శనివారం మండలంలోని గౌతాపూర్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అన్ని పత్రాలు సమర్పించాలన్నారు. ఏదైనా తిరస్కరణకు గురైతే ఆర్టీఓకు అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత శాఖలకు చెందిన అధికారులు వేగంగా చేపట్టారు. గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే మార్గంలో శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై పెద్దమ్మ దేవాలయం నుంచి కొత్తూర్ గేట్ ఫ్యూచర్‌సిటీ రహదారి వరకు నేషనల్ హైవే అధికారులు తారు వేసే పనులు చేపట్టారు. ఫ్యూచర్‌సిటీ మార్గంలో ఇప్పటికే గ్రీనరీ ఉండగా అదనంగా మొక్కలు నాటే పనులను హెచ్‌ఎండీఏ అధికారులు చేపట్టారు. మున్సిపల్ అధికారులు తుక్కుగూడ ఓఆర్‌ఆర్ నుంచి వచ్చే మార్గంలో ఇరువైపులా కుండీల్లో నాటిన మొక్కలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు తమ పనుల్లో బిజీబిజీ అయ్యారు. మరోవైపు నిత్యం ఎవరో ఒక అధికారి గ్లోబల్ సమ్మిట్ ప్రాంతాన్ని సందర్శిస్తుండటంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇబ్రహీంపట్నం: తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నంకు చెందిన చెనమోని శంకర్ ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సంఘం 4వ రాష్ట్ర మహాసభల్లో ఈ మేరకు శంకర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శనివారం శంకర్ మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవి అప్పగించిన వారి ఆశలను వమ్ము చేయకుండా, మత్స్యకారుల, కార్మికుల సమస్యల పరిష్కరానికి అహర్నిశలు కృషిచేస్తానని తెలిపారు.
మొయినాబాద్: ఇందిరమ్మ కాలంలో దళితులకు ఇచ్చిన భూములను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకోవడానికి కుట్రలు చేస్తోందని దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో సర్వేనంబర్ 218/1లో 6 ఎకరాల భూమిని కోళ్ల ఫారాల నిర్మించుకోవడానికి యాబై ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ హయాంలో గ్రామానికి చెందిన 36 మంది దళిత కుటుంబాలకు కేటాయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సదరు సర్వేనంబర్‌లోని మొత్తం ప్రభుత్వ భూమిని హెచ్‌ఎండీఏకు అప్పగించింది. దళితులకు కేటాయించిన భూములు సైతం అందులోనే కలిపి చదును చేస్తుండడంతో శనివారం దళితులు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. తమకు కేటాయించిన భూమిని తమకే ఇవ్వాలని.. ఇతరులకు కేటాయించొద్దని పట్టు బట్టారు. దీనిపై కలెక్టర్‌ను కలిసి తమ ఆవేదన చెప్పుకొంటామన్నారు. ఎట్టి పరిస్థితుత్లో భూములు వదులుకోమని తేల్చి చెప్పారు. భూములు గుంజుకోవాలని చూస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
రేపు సామూహిక భగవద్గీత పారాయణం


