కేసీఆర్ దీక్ష ఫలితమే ప్రత్యేక తెలంగాణ
వికారాబాద్: కేసీఆర్ దీక్ష ఫలితమే ప్రత్యేక తెలంగాణ అని.. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ తల్లి, కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ అమరులకు నివాళి అర్పించారు. అనంతరం ఉద్యమకారులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలనలో అణచివేతకు, వివక్షకు గురైన తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ ఉద్యమ సారథి అయ్యారని గుర్తుచేశారు. ఆయన నడుం బిగించి సకల జనులను కదిలించారన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించి పెట్టారని పేర్కొన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా పాలన అందించారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. ఇందుకు లగచర్ల ఘటనే నిదర్శనమన్నారు. రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని అన్నారు. బీఆర్‌ఎస్ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణ సాధ్యమైందన్నారు. పాలనలో ఆయనకు ఎవరూ సాటిరారన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి ఎన్నో అద్భుత పథకాలు తెచ్చి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. కేసీఆర్ దీక్షకు పునుకోకపోతే తెలంగాణ వచ్చేదా..? అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. నాడు ఆంధ్రా పాలకులకు తొత్తులుగా ఉన్న వ్యక్తులకు కేసీఆర్ గురించి మాట్లాడే హక్కే లేదన్నారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్ రైతు బాంధవుడిగా మారారని అన్నారు. రైతు బీమా, రైతుబంధు లాంటి ఎన్నో పథకాలు తెచ్చి అండగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, విద్యా మౌలిక వనరుల కల్పన సంస్థ రాష్ట్ర మాజీ చైర్మన్ నగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడిందన్నారు. తెలంగాణ అమరులకు ప్రతిఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు.
చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చిండు
తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన ఘనత ఆయనదే
గెలిచిన ఏడాదిలోపే రేవంత్ రాష్ట్రాన్ని ఆగం చేసిండు
దీక్షా దివస్ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్


