విద్యార్థులు మానసిక
● మారుతున్న కాలానికి అనుగుణంగా సంసిద్ధం కావాలి
● వ్యక్తిత్వ వికాస నిపుణుడు రవిపాల్‌రెడ్డి
ఒత్తిడికి లోనుకావొద్దు
తాండూరు: పదో తరగతి విద్యార్థులు పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడికి లోనుకారాదని వ్యక్తిత్వ వికాస నిపుణుడు, సిగ్మా ఐఏఎస్ అకాడమీ డైరక్టర్ బండ రవిపాల్‌రెడ్డి సూచించారు. శనివారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్‌లో సేవా భారతి, నిష్ట ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు భవిషత్ కార్యాచరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెన్త్ పాసైన తర్వాత ఏ కోర్సులో చేరాలనే దానిపై విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి కాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా ప్రమాణాలలో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు సంసిద్ధం కావాలని సూచించారు. రోజూ దిన పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. పరీక్షల సమయంలో చదవడంతోపాటు రాయడం కూడా చేయాలన్నారు. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. వ్యక్తిత్వ వికాసం వల్ల విజ్ఞానం పెరుగుతోందని చెప్పారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవాలన్నారు. అనంతరం సింగ్రీ అకాడమీ డైరక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. జీవితంలో విజయం సాధించాలంటూ ధైర్యం, పట్టుదల, నిరంతర సాధన అవసరం అన్నారు. నీట్, ఐఏఎస్ లాంటి పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కొట్రికే విజయలక్ష్మి, నాయకులు బాలకృష్ణ, గాజుల బస్వరాజ్, అనురాధ, రమేష్, కేవీఎం వెంకట్, వెంకట్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సుబ్బారావు, ప్రభు శంకర్ తదితరులు పాల్గొన్నారు.


