ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
పరిగి: సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు అన్నారు. శుక్రవారం మండలంలోని ఆయా పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు ఏళ్లు గడుస్తున్నా బకాయిలు ఇవ్వడం లేదన్నారు. దీంతో వారు దిగులు చెందుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులను విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల డబ్బులు సకాలంలో అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూటీఎఫ్ నిత్యం ఉపాధ్యాయులు, విద్యా సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు దశరథ్, నాయకులు మోయిజ్‌ఖాన్, వెంకటయ్య, బుచ్చయ్య, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు


