దివ్యాంగుల ప్రేరణకు క్రీడాపోటీలు
అనంతగిరి: మహిళాశిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్‌లోని బ్లాక్ గ్రౌండ్‌లో జిల్లాలోని దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి మాట్లాడుతూ.. సమాజంలో దివ్యాంగులు సాధారణ పౌరులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారన్నారు. దివ్యాంగుల తల్లిదండ్రుల కన్నా టీచర్లు, గార్డియన్లు తోడుగా నిలిచి వారికి సకాలంలో సరైన ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. ఇలాంటి వేడుకలు నిర్వహించడం ద్వారా దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా మనోస్థైర్యం పెరుగుతుందన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న వారందరూ రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైన విజయాలను సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ కాంతారావు, సంబంధిత శాఖల సిబ్బంది పీఈటీలు, జిల్లాకు చెందిన దివ్యాంగుల సంఘాల నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.


