వ్యూహాలకు పదును!
పట్టు సాధించేందుకు ‘గులాబీ’ దళం పోరాటం ‘కమల’ వికాసానికి బీజేపీ నేతల తాపత్రయం పంచాయతీ పోరుకు సిద్ధమవుతున్న అన్ని పార్టీల మద్దతుదారులు ఇప్పటికే రంగంలోకి దిగిన కాంగ్రెస్ నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు ఏకగ్రీవ జీపీలకు రూ.10 లక్షల నజరానా ప్రకటన
ఉనికి కోసం ప్రతిపక్షాల ఆరాటం
వికారాబాద్: పంచాయతీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కార్యాచరణ మొదలు పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పల్లె పోరులో సైతం సత్తా చాటాలని అధికార హస్తం పార్టీ పట్టుదలతో ఉంది. మెజార్టీ జీపీలను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకరావాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలకు పరీక్ష లాంటిదని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఎక్కువ మంది సర్పంచులు, వార్డు సభ్యులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం.
క్షేత్రస్థాయిలో మరింత బలపడేందుకు..
క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు సెగ్మెంట్‌లో కేవలం ఆరు వేల ఓట్లతో ఆ పార్టీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వికారాబాద్‌లో 10వేల ఓట్లతో స్పీకర్ ప్రసాద్‌కుమార్ గెలుపొందగా.. పరిగిలో రామ్మోహన్‌రెడ్డి 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి 32 వేల భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయావకాశాలపై ఆ పార్టీ సహజంగానే భారీ అంచనాలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే వ్యూహాలను పదును పెట్టి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. మెజారిటీ సర్పంచ్ స్థానాలను తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఒక్కో పంచాయతీలో ఒక అభ్యర్థే సర్పంచ్ బరిలో ఉండేలా ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించింది. పార్టీ గుర్తులపై కాకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రజల్లో పలుకుబడి, మంచి పేరున్న వ్యక్తులనే బరిలో దింపాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. సర్పంచులుగా పోటీ చేసేందుకు ఒకే పార్టీ నుంచి పలువురు ఆశావహులు ఉంటే వారికి త్వరలో జరగనున్న సహకార, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పించే విధంగా నచ్చజెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. మండల స్థాయిలో ముఖ్య నేతల ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పార్టీ ద్వారా అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించే ప్రయ త్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, రూ.500 గ్యాస్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత కరెంటు, సన్నబి య్యం తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఏకగ్రీవాలపై కాంగ్రెస్ ఫోకస్
ఏకగ్రీవ పంచాయతీలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వ తరఫున రూ.10 లక్షలు నజరానా ఇవ్వనుంది. ఈ మొత్తంతోపాటు ఎమ్మెల్యే నిధుల నుంచి మరో రూ.10 లక్షలు కేటాయించేందుకు సిద్ధమైంది. ఈ ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
‘హస్త’గతం కోసం అధికార పక్షం ఆరాటం
అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని మూటగట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. జిల్లాలోని నాలుగు స్థానాల్లో కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఎక్కువ మంది సర్పంచులను గెలిపించుకోవడం ద్వా రా మిగతా ఎన్నికల్లో సత్తా చాటవచ్చని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఆ దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదనే చెప్పాలి. భారతీయ జనతా పార్టీ, సీపీఐ, సీపీఎం పార్టీలు సైతం తమ అభ్యర్థులను బరిలో దించాలని భావిస్తున్నాయి.


