‘లక్నాపూర్’ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
పరిగి: లక్నాపూర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్నాపూర్ ప్రాజెక్టుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తామని తెలిపారు. ప్రాజెక్టులో అదనపు బోట్ల కోసం రూ.96 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. త్వరలో గెస్ట్ హౌస్‌లు కూడా నిర్మిస్తామన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో టాటా సంస్థ ఆధ్వర్యంలో ఇండస్ట్రీయల్ అడ్వన్స్ ట్రైనింగ్ సెంటర్‌ను రూ.60 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. త్వరలో మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.20 కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, పరిగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి పంతులు, నాయకులు శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


