స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
అనంతగిరి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. శుక్రవారం వికారాబాద్‌లోని తన కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీస్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నందున పక్కాగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 582 గ్రామాల్లో 4,956 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు రవాణా జరిగే ఆస్కా రం ఉన్నందున తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. ఎస్‌ఎస్‌టీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లను గుర్తించి అదనపు బలగాలను మోహరించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పాత నేరస్తులు, రౌడీ షీటర్లను ముందుగానే బైండోవర్ చేయాలన్నారు.గన్ లైసెన్స్ కలిగిన వ్యక్తుల నుంచి వెంటనే ఆయుధాలను డిపాజిట్ చేసుకోవాలన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్, డీటీసీ డీఎస్పీలు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, ఎన్ యాదయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.


