వీధి కుక్కల వీరంగం
● దాడి చేయడంతో
నలుగురికి తీవ్ర గాయాలు
● మున్సిపల్ అధికారులపై
స్థానికుల ఆగ్రహం
తాండూరు టౌన్: పట్టణం పరిధిలోని మల్‌రెడ్డిపల్లిలో వీధి కుక్కలు గురువారం స్వైర విహారం చేశాయి. ఉదయాన్నే వీఽధిలో వెళ్తున్న వారిపై దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కల నియంత్రణలో మున్సిపల్ అధికారులు విఫలమైనట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్‌రెడ్డిపల్లికి చెందిన దొడ్ల శ్రీనివాస్ తెల్లవారుజామున పాలు పితికి తీసుకుని వస్తుండగా వీధి శునకాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈదాడిలో ఆయన ఎడమ అరచేయికి తీవ్ర గాయాలమైంది. వీధి గుండా నడుచుకుంటూ వెళ్తున్న భీమప్ప, వెంకటమ్మ, జగదేవిలను సైతం దాడి చేసి గాయ పరిచాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. వీధి శునకాల నియంత్రణలో భాగంగా వందల సంఖ్యలో స్టెరిలైజేషన్ చేశామని మున్సిపల్ అధికారులు గొప్పలు చెప్పుకోవడమే తప్పా క్షేత్ర స్థాయిలో అలాంటిదేమీ లేదని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు వీధి కుక్కల నియంత్రణ చేపట్టకపోతే కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని పలువురు హెచ్చరించారు.
వీధి కుక్కల వీరంగం


