పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు
● ఎలక్షన్ సజావుగా నిర్వహించాలి
● ఎన్నికల సాధారణ పరిశీలకులుషేక్ యాస్మిన్ బాషా
● పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
అనంతగిరి: గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ స్నేహామెహ్రాతో కలిసి నోడల్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న, రెండో విడత డిసెంబర్ 14న, మూడో విడత 17న జరగనున్నట్లు వివరించారు. ఇందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆర్వోలు, ఏఆర్‌ఓలు, పీఓ, ఏపీఓలకు జోనల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులకు మరోసారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మెటీరియల్ మేనేజ్ మెంట్, ఎన్నికల సిబ్బంది, జోనల్ అధికారుల నియామకం, కోడ్ అమలుపై నిత్యం నివేదికలు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా ద్వారా నిర్వర్తించే విధులు సంబంధిత అధికారి చూడాలన్నారు. ఎన్నికల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 912 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, 922 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. క్లస్టర్ వారీగా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో వ్యయ పరిశీలకులు మనోహర రాజు, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఆర్‌ఓ మంగీలాల్, ఆర్‌డీఓ వాసుచంద్ర, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, నోడల్ అధికారులు పాల్గొన్నారు.


