సంగ్రామం షురూ!
వికారాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మూడు దఫాలుగా జరగనున్న ఈ ఎన్నికలకు మొదటి విడత నోటిఫికేషన్ వెలువడనుంది. రిటర్నింగ్ అధికారుల ప్రకటన అనంతరం గురువారం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే జీపీల వారీగా అధికారులను సైతం నియమించారు. తొలి విడత ఎన్నికలు వచ్చే నెల 11వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, డీపీఓ జయసుధ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా సంబంధిత అధికారులు నామినేషన్ల స్వీకరణ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించేవరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందులకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పరుగులు పెడుతున్నారు.
మొదట 262 పంచాయతీలు
జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలున్నా యి. వీటిలో తొలిదశలో 262 పంచాయతీలకు ఎన్ని కలు జరుగుతాయి. ఈ గ్రామ పంచాయతీల పరిధిలో 2,198 వార్డులు ఉండగా వీటికి కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. తాండూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తాండూరు మండలంలోని 33, బషీరాబాద్ 39, యాలాల 39, పెద్దేముల్ 38, కొడంగల్ 25, దౌల్తాబాద్ 33, బొంరాస్‌పేట్ 35, దుద్యా ల్ మండల పరిధిలోని 20 పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడత పోలింగ్ జిల్లా పరిధిలోని ఎనిమిది మండలాల్లో జరగనుండగా ఇందులో 2,94,560 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ప్రారంభోత్సవాలకు బ్రేక్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడానికి వీలులేదు. ఓటర్లను ప్రలోభపెట్టే ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు నిర్వహించరాదు. నిధులు మంజూరైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మరో నెల రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఇప్పటికే నిధులు మంజూరై కొనసాగుతున్న పనులకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండదు. సంక్షేమ పథకాల అమలులో కూడా కొత్త లబ్ధిదారుల ఎంపిక మాత్రం జరగదు. అదే విధంగా పాత లబ్ధిదారులకు మాత్రం యథాతథంగా సంక్షేమ ఫలాలు అందనున్నాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో మరో నెలరోజుల పాటు అభివృద్ధి పనులకు ఆటంకం కలగనుంది.
తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు
డిసెంబర్ 11న పోలింగ్
మండలాల వారీగా బ్యాలెట్ పత్రాలు, బాక్సుల సరఫరా
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
గ్రామాల్లో ఎన్నో రోజులుగా లూగిసలాడుతూ వస్తున్న సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. అందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి విడతలో జరిగే ఎన్నికల నామినేషన్లను నేటి నుంచే స్వీకరించనున్నారు.
జిల్లాలో మొదటి విడత వివరాలు
గ్రామ పంచాయతీలు 262
వార్డుల సంఖ్య 2,198
ఓటర్ల సంఖ్య 2,94,560
నేటి నుంచి నామినేషన్లు
తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్లు గురువారం నుంచి స్వీకరించనున్నారు. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామపత్రాలు స్వీకరిస్తారు. 30న నామినేషన్లను పరిశీలించటంతోపాటు అదే రోజు సాయంత్రం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. వచ్చే నెల 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణలకు అవకాశం ఇస్తారు. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 9వ తేదీ సాయంత్రం వరకు ప్రచారం గడువు ఉండగా 11వ తేదీ పోలింగ్ నిర్వహించి అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ వెంటనే ఉప సర్పంచ్‌ని సైతం ఎన్నుకోనున్నారు.


