ఇక డిజిటల్ బోధన
పరిగి: రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ పాఠశాలలకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. డిజిటల్ తరగతులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పనకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండు దశల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు పూర్తి చేసేందుకు ప్రతిపాదనలను విద్యాశాఖ రూపొందించింది. కంప్యూటర్ ఉన్న పాఠశాలలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్లను ఆయా పాఠశాలకు ఇవ్వడంపై దృష్టి సారిస్తోంది. దశల వారీగా పాఠశాలలను ఎంపిక చేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ ఆలస్యమైతే ప్రైవేట్ ఇంటర్నెట్ సౌకర్యానికి అవకాశం కల్పించింది. పాఠశాలల గ్రాంటు నుంచి కనెక్షన్లు తీసుకోవాలనే ఆదేశాలపై ప్రధానోపాధ్యాయులు ఆసక్తి చూడపం లేదు. దీంతో ఇంటర్నెట్ సౌకర్యం లేక ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డులపై డిజిటల్ బోధనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఇంటర్నెట్ సేవలు నిల్
పరిగి నియోజకవర్గంలో పరిగి, దోమ, కుల్కచర్ల, చౌడాపూర్, పూడూర్ మండలాలున్నాయి. నియోజవర్గంలో మొత్తం 291 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో నాలుగు కేజీబీవీ, మూడు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 44, ప్రాథమిక 222, ప్రాథమికోన్నత 23లు ఉన్నాయి. పరిగి మండలంలో మొత్తం 61 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఏ ఒక్క బడికి కూడా ఇంటర్నెట్ సౌకర్యం లేదు. దోమ మండలంలో మొత్తం70 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇంటర్నెట్ సౌకర్యం లేదు. కుల్కచర్లలో 64, చౌడాపూర్‌లో 44, పూడూరులో 50 ప్రభుత్వ పాఠశాలలు సాంకేతిక వెసులుబాటు లేదు. దీంతో డిజిటల్ బోధనకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో విద్యార్థులకు బోధన, ఆన్‌లైన్ రిపోర్టు తదితర పనులు పాఠశాల నుంచే నిర్వహించేందుకు వీలుంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తీరనున్న ఇబ్బందులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు లేక ఏఐ తరగతులు, యూడైస్ ప్లస్‌లో వివరాల నమోదు, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు, డిజిటల్ బోధనకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యాశాఖ పాఠశాలల్లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులు విషయాల వారీగా టాపిక్, నిపుణుల పాఠాలు వీక్షించే పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేక పోవడంతో పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డులు ఉన్నా ఆన్‌లైన్ తరగతులు జరగడం లేవు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల మొబైల్ ఫోన్‌లోని నెట్ ఆధారంగా పాఠాలు చెబుతున్నారు. ఏఐ బోధన జరుగుతున్న ఇంటర్నెట్ సౌకర్యం లేక సక్రమంగా అమలు కావడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుండటంతో పాఠశాలల్లోని సమస్యలు పరిష్కారం అవుతాయని ఉపాధ్యాయులు అంటున్నారు.
నివేదిక పంపించాం
మండలంలో ఒక్క ప్రభు త్వ పాఠశాలలో సైతం ఇంటర్నెట్ సౌకర్యం లేదు. కొన్నింటిలో డిజిటల్ బోధన ఉపాధ్యాయుల మొబైల్ ఫోన్ నుంచే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి ఇంటర్నెట్ లేని బడుల వివరాలను అందించాం. త్వరితగతిన సాంకేతిక సౌకర్యం కల్పించాలి.
– గోపాల్, ఎంఈఓ, పరిగి
సర్కార్ బడులకు ఇంటర్నెట్ సౌకర్యం
దశలవారీగా అన్ని పాఠశాలలకు ఏర్పాటు
కంప్యూటర్లు ఉన్న స్కూళ్లకు మొదటి ప్రాధాన్యం
వివరాలను సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు


