సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
● తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
బషీరాబాద్: మండలంలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్‌రెడ్డితో కలిసి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. గతంలో ఎక్కడెక్కడ రాజకీయ గొవడలు జరిగాయో ఆ గ్రామాల వివరాల రికార్డులను పరిశీలించారు. సర్పంచ్ ఎన్నికల్లో కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. కర్ణాటక సరిహద్దు మండలం కావడంతో సరిహద్దు గ్రామాల చెక్‌పోస్టుల దగ్గర తనిఖీలు చేయాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వనరులను కొల్లగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటిసారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన డీఎస్పీకి పోలీసులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నుమాన్‌అలీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


