పల్లెపోరు షురూ
పల్లెల్లో పంచాయతీ పోరు సందడి నెలకొంది. ఆశావహులు.. మద్దతు కూడగట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. రానున్న పరిషత్ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకున్న రాజకీయ పార్టీలు.. బలమున్న వారినే బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
బషీరాబాద్: పంచాయతీ పోరుకు నగారా మోగడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ బరిలో నిలిచే ఆశావహులు గ్రామాల్లో చోటా, మోటా లీడర్ల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. తనకు మద్దతు తెలిపితే.. ఎన్నికల్లోఎంతైన ఖర్చు పెట్టడానికి పోటీదారులు సై అంటున్నారు. ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులను మచ్చిక చేసుకునేందుకు తొలిరోజే దావతులు మొదలు పెట్టారు. మొదటి విడత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ దాఖలు మొదలు కానుండడంతో.. చలికాలంలో ఎన్నికల వేడి రాజుకుంది.
పెద్దలతో మంతనాలు
తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్, కోట్‌పల్లి మండలాలలో 155 గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో సర్పంచి పదవికి పోటీపడుతున్న ఆశావహులు.. నాయకుల ప్రసన్నం కోసం పరుగులు తీస్తున్నారు. సొంతూరులో పోటీ చేయడానికి వచ్చిన రిజర్వేషన్.. మళ్లీ రాదని భావిస్తున్న వారు.. అందరినీ కూడగట్టుకునే ప్రయత్నాలు తీవ్రం చేశారు. పోటీకి తమ సామాజికవర్గం నుంచి ఎవరూ అడ్డు రాకుండా సముదాయిస్తూ.. వారిని అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నారు. బుధవారం ఆయా గ్రామాల్లో గ్రామ పెద్దలతో మంతనాలు జరిపారు.
గెలుపు గుర్రాల కోసం
ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు రిజర్వేషన్ల ప్రకారం ఆయా సామాజిక వర్గాల్లో ఆర్థికంగా బలమైన గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రస్తుతం సర్పంచులను గెలిపించుకోవాలని భావిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. సీఎం సొంత జిల్లా కావడంతో మెజార్టీ పంచాయతీలను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆయా మండలాల ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో బలమున్న ఉన్న వారిని బరిలోకి దించాలని యోచిస్తున్నారు. ముఖ్యంగా మేజర్ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించారు. బీఆర్‌ఎస్ కూడా అదే విధంగా వ్యూహరచనలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బుధవారం బషీరాబాద్‌లో ముఖ్య నేతలను కలిశారు. గ్రామాల్లో ఎక్కడ చూసిన ఎన్నికల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. రచ్చకట్టల దగ్గర, హోటళ్లల్లో ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల చర్చే జరుగుతుంది. రిర్వేషన్లు రావడంతో గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు.
పదవుల యోగం
స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి గిరిజన తండాల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏళ్లతరబడి రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న గిరిజనులకు.. పదవుల యోగం పట్టనుంది. పనుల కోసం హైదరాబాద్, ముంబాయి తదితర ప్రాంతాలకు వెళ్లిన గిరిజనులు, వడ్డెరులు సొంతూర్లకు వస్తున్నారు.తండాల్లో పోటీకి సై అంటున్నారు.
ఏకగ్రీవంపై దృష్టి
అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మెజార్టీ జీపీలను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రణాళిక చేస్తోంది. కొన్ని గ్రామాల్లో బీఆర్‌ఎస్‌కు ఆర్థికంగా బలమైన నాయకులు లేకపోవడంతో, వాటిని ‘హస్త’గతం చేసుకోవాలని చూస్తోంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్.. ప్రతి పంచాయతీలో తమ మద్దతుదారులను బరిలో దింపడానికి అభ్యర్థులను అన్వేషిస్తోంది. వారి బాటలోనే బీజేపీ పయనిస్తోంది.
నియోజకవర్గంలో జీపీలు, వార్డుల వివరాలు
గ్రామాల్లో స్థానిక సందడి
చలిలో వేడిపుట్టిస్తున్న సర్పంచ్ ఎన్నికలు
మద్దతు కోసం ఆశావహుల హడావుడి
బలమైన అభ్యర్థి కోసం పార్టీల అన్వేషణ
నేటి నుంచి మొదటి విడత నామినేషన్లు


