సేవల్లో.. ‘అమ్మ ఒడి’
● గర్భిణులు, బాలింతలకు
ఉచిత రవాణా సదుపాయం
● జిల్లావ్యాప్తంగా
ఎనిమిది వాహనాల ద్వారా సేవలు
కుల్కచర్ల: ప్రతీ మహిళకు మాతృత్వపు దశ ఎంతో గొప్పది. ఈసమయంలో వారికి అందే వైద్యసేవలు అత్యంత ముఖ్యమైనవి. గర్భిణులు ఇంటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి, పరీక్షలు, చికిత్సల అనంతరం గమ్యస్థానాలకు చేరుకోవడం ఎంతో ప్రధానం. శ్రీఅమ్మ ఒడిశ్రీ పేరుతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆయా ఆస్పత్రులకు అనుసంధానంగా ఎనిమిది 102 వాహనాలను నిర్వహిస్తున్నారు. ఇవి ప్రత్యేకంగా గర్భిణులు, బాలింతలకు సేవలు అందిస్తున్నాయి. వైద్యులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం గ్రామాల్లోకి వెళ్లి రవాణా సదుపాయం కల్పిస్తాయి.
అప్ అండ్ డౌన్..
గర్భిణులు, బాలింతలను వారి ఇంటి నుంచి దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లడం, వైద్య పరీక్షలు, చికిత్సలు పూర్తయిన అనంతరం తిరిగి ఇంటి వద్ద దిగబెట్టడం వీరి విధి. మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది. ఈసేవలు పూర్తి ఉచితం.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా వ్యాప్తంగా అమ్మఒడి కార్యక్రమం ద్వారా 102 సేవలను అందిస్తున్నాం. గర్భిణులు, బాలింతలను ఇంటినుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి, వైద్యం అనంతరం సురక్షితంగా ఇంటి వద్ద దింపేస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రదీప్‌కుమార్, 102 జిల్లా కోఆర్డినేటర్
మరింత శ్రద్ధ చూపుతున్నాం..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. గర్భిణులు, బాలింతల విషయంలో మరింత శ్రద్ధ చూపుతున్నాం. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దు. అమ్మఒడిలో భాగంగా 102 వాహనాలు ఉచిత రవాణా సేవలు కల్పిస్తున్నాయి.
– కిరణ్ గౌడ్, కుల్కచర్ల మండల వైద్యాధికారి


