హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
● ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయిన ప్రజలు
● మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పరిగి: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఆ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో.. అధికార పార్టీ గండీడ్ మండలం చెన్నయపల్లితండాకు చెందిన పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అధికార పార్టీ పనైపోయిందని, అందుకే ఆ పార్టీ నాయకులు కారు ఎక్కేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని.. అధిష్టానం గుర్తిస్తుందని, విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


