ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
● కోటబాసుపల్లిలో విషాదం
● కేసు నమోదు చేసిన పోలీసులు
తాండూరు రూరల్: రోడ్డు దాటుతుండగా ట్రాక్టర్ ఢీ కొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కరన్‌కోట్ పోలీస్ స్టేష్‌న్ పరిధిలోని కోటబాసుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కోటబాసుపల్లికి చెందిన వడ్డె రాజు, వడ్డె గంగమ్మకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వీరిలో చిన్న కుమారుడు వడ్డె చిన్న యాదగిరి(17) మినహా అందరికీ వివాహాలయ్యాయి. యాదగిరి కుటుంబ సభ్యులతో కలిసి నాపరాతి గనుల్లో కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద రోడ్దు దాటుతుండగా గోడ నిర్మాణానికి వినియోగించే రాయి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. టైర్ల కింద పడిన బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


