మోగిన నగారా
పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
అనంతగిరి: ఎన్నికల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు మంగళవారంతో తెరపడింది. పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ జారీ చేయడంతో గ్రామాల్లో ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 594 పంచాయతీలు ఉండగా, 5,058 వార్డులు ఉన్నాయి. మొదటి విడతలో తాండూరు డివిజన్ లోని తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దే ముల్, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల్ మండలాల్లోని 262 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో వికారాబాద్ డివిజన్‌లోని వికారాబాద్, ధారూరు, మోమిన్‌పేట, నవాబుపేట, బంట్వారం, మర్పల్లి, కోట్‌పల్లి మండలాల్లోని 175 జీపీల్లో.. మూడో విడతలో వికారాబాద్ డివిజన్‌లోని పరిగి, పూడూరు, కుల్కచర్ల, చౌడాపూర్, దోమ మండలాల్లోని 157 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి.
23 నెలలుగా ప్రత్యేక పాలనలో..
2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించగా పదవీ కాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ వస్తోంది. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయి. దీనికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం అందకపోవడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు తప్పలేదు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో త్వరలో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. దీంతో రెండేళ్లుగా నెలకొన్న స్తబ్ధత తొలగనుంది.
గతంలో పెద్ద ఎత్తున ఖర్చు
ప్రభుత్వం దసరా పండుగకు ముందు సెప్టెంబర్‌లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆశావహులు అప్పటికే రంగంలోకి దిగారు. ఎ న్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఏ ర్పాట్లు చేసుకున్నారు.వినాయకచవితి, దసరా సమయాల్లో పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. కానీ బీసీ రిజర్వేషన్లపై కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం.. ఎన్నికలను వాయిదా పడడంతో వారి ఆశల పై నీళ్లు చల్లినట్‌లైంది. తాజా నోటిఫికేషన్‌తో ఇక గ్రామాల్లో ఎన్నికల కోలాహలం నెలకొననుంది.
బలమైన అభ్యర్థులను
రంగంలోకి దింపేందుకు..
ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడడంతో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ దృష్టి సారించాయి. ఆర్థికంగా బలంగా ఉన్న వారితో పాటు, పలుకుబడి ఉన్న వారిని గుర్తించి మద్దతిచ్చే పనిలో నిమగ్నమయ్యాయి.
షెడ్యూల్ ఇదీ..
ఎన్నికల నిర్వహణ మొదటి విడత రెండో విడత మూడో విడత
నామినేషన్ల స్వీకరణ 27 (నవంబర్) 30 (నవంబర్) 3 (నవంబర్)
చివరి తేదీ 29 (నవంబర్) 2 (డిసెంబర్) 5 (డిసెంబర్)
నామినేషన్ల పరిశీలన 30 (నవంబర్) 3 (డిసెంబర్) 6 (డిసెంబర్)
అభ్యర్థుల జాబితా 30 (నవంబర్) 3 (డిసెంబర్) 6 (డిసెంబర్)
ఉపసంహరణ 3 (డిపెంబర్) 6 (డిసెంబర్) 9 (డిసెంబర్)
అభ్యర్థుల జాబితా 3 (డిసెంబర్) 6 (డిసెంబర్) 9 (డిసెంబర్)
పోలింగ్ 11 (డిసెంబర్) 14 (డిసెంబర్) 17(డిసెంబర్)


