వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలివ్వాలి
కొడంగల్ రూరల్: జీఓ నంబర్ 81, 85 ప్రకారం వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వీఆర్‌ఏల సమస్యల పరిష్కారం కోసం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాల జేఏసీ ఆధ్వర్యంలో చలో కొడంగల్ కార్యక్రమంలో నిర్వహించారు. మంగళవారం కడా కార్యాలయానికి చేరుకున్న వీరు సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 340మంది వీఆర్‌ఏలు మృతి చెందారని, అనేక మంది అనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం పాలైన తల్లిదండ్రల స్థానంలో వారసులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. 61 ఏళ్లకు పైబడిన 3,797మంది వీఆర్‌ఏల వారసులకు వారి తండ్రి స్థానంలో ఉద్యోగ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. కడా కార్యాలయానికి వెళుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో వీఆర్‌ఏ జేఏసీ నాయకులు జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు నర్సింలు, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు సత్యం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భరత్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్, యాలాల మండల అధ్యక్షుడు కోట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వీఆర్‌ఏల అక్రమ అరెస్ట్ సరికాదు
పరిగి: ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, వీఆర్‌ఏ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. 61 సంవత్సరాలు పైబడిన వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ మంగళవారం చలో కొడంగల్ కార్యక్రమం చేపట్టారు. వారిని మార్గమధ్యలో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వీఆర్‌ఏలు సీఐటీయూ ఆధ్వర్యంలో పరిగి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీఆర్‌ఏల అక్రమ అరెస్టు సరికాదన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జీఓ నంబర్ 81, 85 ప్రకారం మిగిలిపోయిన వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. కార్యక్రమంలో వీఆర్‌ఏ జేఏసీ నాయకులు సంగమేష్, రాజఽశేఖర్, రవి, భరత్, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.


