మళ్లీ నిరాశే!
అన్ని వరాలు సొంత నియోజకవర్గానికే.. మిగతా మూడు నియోజకవర్గాల ఊసే కరువు తాండూరు, వికారాబాద్, పరిగి పేర్లు సైతం ప్రస్తావించని ముఖ్యమంత్రి చిన్నారులకిచ్చే అల్పాహారంలోనూ వివక్షే
వికారాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా మొదటి అధికారిక పర్యటన నిరాశే మిగిల్చింది. వరాల జల్లు కురిపిస్తారనే ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి(నారాయణపేట జిల్లా) బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత రెండు సార్లు దసరా పండుగకు చుట్టపుచూపుగా కొడంగల్‌కు వచ్చి వెళ్లారు. సోమవారం అధికారికంగా జిల్లాలో మొదటి సారి పర్యటించారు. దీంతో అన్ని ప్రాంతాల ప్రజలు, ప్రజాప్రతినిధులు భారీగా నిధులు వస్తాయని ఆశ పడ్డారు. కానీ ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరైంది మొదలు సభ ముగిసే వరకు తన సొంత నియోజకవర్గం కొడంగల్ చుట్టే ప్రసంగం సాగింది. వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. ఈ ప్రాంతాలకు చిల్లిగవ్వ కూడా విదల్చలేదు. అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆయా నియోజకవర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం జిల్లాలో ఇదే టాపిక్ నడుస్తోంది. ఈ విషయమై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ నాయకులు వికారాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ పలు విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక కొడంగల్‌కా అని ప్రశ్నించారు.
అన్నింటా అదే పరిస్థితి
అభివృద్ధి, సంక్షేమం రెండింటి విషయంలోనూ కొడంగల్ నియోజకవర్గం మినహా మిగతా ప్రాంతాలకు నిరాశే ఎదురైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల తరహాలోనే వికారాబాద్, పరిగి, తాండూరుకు నిధులు వచ్చాయే తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదనే విమర్శ ఉంది. కొడంగల్‌కు మాత్రం పారిశ్రామిక వాడ, డెంటల్, మెడికల్, ఇంజనీరింగ్, పాల్‌టెక్నిక్, ఫిజియోథెరపీ, అగ్రికల్చర్, వెటర్నరీ, డిగ్రీ, ఇంటర్ తదితర కళాశాలన్నీ మంజూరు చేశారు. ఇందులో ఏ ఒక్కటి కూడా జిల్లా పరిధిలోని ఇతర నియోజకవర్గాలకు మంజూరు చేయలేదు. ప్రభుత్వ బడులలో చదువుతున్న విద్యార్థుల విషయంలోనూ వివక్షే కనిపిస్తోంది. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని 312 పాఠశాలలకు చెందిన 28 వేల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తుండగా మిగతా మూడు ప్రాంతాల్లో ఆ పథకం కనిపించడంలేదు. సోమవారం జరిగిన సీఎం సభలో జిల్లా అంతటా ఈ పథకం వర్తింపజేస్తారని అందరూ ఆశించారు. కానీ అలాంటి ప్రకటనే చేయలేదు. ఇదే వేదికగా కొడంగల్ పరిధిలోని ఆయా మండలాలకు, గ్రామాలకు కమ్యూనిటీ హాళ్లు, కార్యాలయాలకు నూతన భవనాలు, సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. మిగతా నియోజకవర్గాల ఊసే లేదు. ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి పక్కనే స్టేజీ పంచుకుంటున్న తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు కూడా వారి నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించుకోలేపోయారనేది వాస్తవం.
మున్సిపాలిటీలకు మొండిచేయి
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ ఉండగా ఇందులో అన్నింటికంటే చిన్నది కొడంగల్. ఏడాది కాలంగా ఆ మున్సిపాలిటీలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీ, కార్యాలయాలు, ఆస్ప్రతుల నిర్మాణ పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. తాజాగా ఇదే మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం రూ.60 కోట్ల విలువ చేసే పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. కొడంగల్ కంటే పెద్ద పురపాలికలకు చిల్లిగవ్వ కూడా కేటాయించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే తాండూరు, వికారాబాద్, పరిగి ప్రాంతాలకు రూ.15 నుంచి రూ.25 కోట్లు మంజూరైనా నిధులు విడుదల కాక పనులు ప్రారంభానికి నోచుకోలేదు. సీఎం నుంచి నిధులు రాబట్టడంలో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, స్పీకర్ విఫలమయ్యారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
జిల్లాకు అసంతృప్తి మిగిల్చిన సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన


