
సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం
అనంతగిరి: సెప్టెంబర్ 1న సీపీఎస్ రద్దుకు పీఆర్టీయూటీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన మహాధర్న కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్ర శేఖర్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐక్యంగ పోరాటం చేసి సాధించుకోవాలన్నారు.
మొయినాబాద్: వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేసే విషయంలో మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ వ్యవహరించిన తీరుపై కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని శనివారం చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ విషయమై వారు విచారించగా కొత్తగా ఏర్పడిన చేవెళ్ల, శంకర్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయాల్లోనే జాతీయ జెండా ఎగురవేసినట్లు తెలిసింది. వార్డు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలో విషయంలో అక్కడి మున్సిపల్ కమిషనర్లు ప్రజలతో సమయస్ఫూర్తితో సానుకూలంగా మాట్లాడారని, మొయినాబాద్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ మాత్రం స్థానికులతో దురుసుగా మాట్లాడటం వివాదంగా మారినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు నివేదించినట్లు సమాచారం. ఈ విషయంలో కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
శంకర్‌పల్లి: ఓటు చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు శనివారం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా ఇన్‌చార్జి ఇంద్రసేనారెడ్డి, అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మహిళా అధ్యక్షురాలు జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని దుర్వినియోగం చేయడం అన్యాయమని అన్నారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్‌చార్జి రామ్మోహన్, నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్, నాయకులు గౌరీ సతీశ్, వెంకటయ్య, చెన్నయ్య, నర్సింలు, శ్రీకాంత్ రెడ్డి, రమ్య, ప్రవీణ్, శ్రీనాథ్ పాల్గొన్నారు.
ఆమనగల్లు: మార్వాడీ వ్యాపారసంస్థలకు వ్యతిరేకంగా పట్టణంలో వివిధ వర్తక, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18న నిర్వహించ తలపెట్టిన బంద్ తాత్కాలికంగా వాయిదాపడింది. మార్వాడి గో బ్యాక్ అంటూ వర్తకులు ఇచ్చిన పిలుపు, మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన ఒకరోజు బంద్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్వాడీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పట్టణంలో బంద్‌కు పిలుపునివ్వడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బంద్‌పై మార్వాడీ వ్యాపారస్తులు, స్థానిక వర్తకసంఘం నాయకుల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక వ్యాపారుల డిమాండ్లకు మార్వాడీలు అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు స్థానిక వర్తకసంఘం నాయకులను పోలీసులు పిలిపించి మాట్లాడారని, ఈ నేపథ్యంలో 18న తలపెట్టిన బంద్‌ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి
ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్
శంషాబాద్ రూరల్: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ సూచించారు. శనివారం పెద్దషాపూర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో వివిధ గ్రామాలకు చెందిన గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో తీసుకునే జాగ్రతలు, పాటించాల్సిన నిబంధనలను తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి, పాల్గొన్నారు.