
పెన్షన్లు పెంచుతావా.. గద్దె దిగుతావా?
సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫైర్ పరిగిలో పింఛనుదారులతో సన్నాహక సమావేశం ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్
పరిగి/తాండూరు: ఎన్నికల సమయంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల కు ఇచ్చిన పెన్షన్ పెంపు హామీని అమలు చేస్తారా లేకుంటే గద్దె దిగుతారా అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. శనివారం పరిగి పట్టణంలోని శారద గార్డెన్‌లో, తాండూరు పట్టణంలోని గగ్రాణి ఫంక్షన్ హాల్‌లో ఎమ్మార్పీఎస్ నేతలతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇస్తున్న రూ.4 వేల పింఛన్‌ను రూ.6 వేలు, చేయూత పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. సెప్టెంబర్ 9న నగరంలోని ఎల్బీ స్టేడియంలో దివ్యాంగులతో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పింఛన్ మొత్తం పెంచకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా పెన్షన్‌లో ఇస్తున్నారో అదే తరహాలో ఇక్కడ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాజీ సీఎం కేసీఆర్‌ను ఎలా గద్దె దించామో, సీఎం రేవంత్‌రెడ్డిని సైతం అలా దించాల్సి వస్తుందని హెచ్చరించారు. పరిగి కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ, ఎంఎస్‌పీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహులు మాదిగ, బి.కృష్ణ మాదిగ, నాయకులు మెట్లి సూర్యప్రకాష్ మాదిగ, ఉమాశంకర్ మాదిగ, ఆనంద్‌కుమార్ మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు చందు, సుందర్, రాజు, గజ్జలప్ప, బలరామ్, రవి,అనిల్, పరశురాం స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.