
అడుగుకో గుంత.. వెళ్లాలంటే చింత
వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు
● వాహనదారులకు తప్పని పాట్లు
మొయినాబాద్: రహదారులు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. అడుగడుగునా గుంతలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మున్సిపల్ పరిధిలోని ఆర్ అండ్ బీ రోడ్లతోపాటు గ్రామాల లింకు రోడ్లు సైతం అధ్వానంగా మారాయి. వర్షాల కారణంగా హిమాయత్‌నగర్– తంగడపల్లి ఆర్ అండ్ బీ రోడ్డులో చిలుకూరు వద్ద పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డుపై వెళ్లే వాహనదారులు నడుములు పట్టేస్తున్నాయని వాపోతున్నారు. చిలుకూరు–మొయినాబాద్ లింకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేపట్టకపోవడంతో గుంతల్లో వర్షం నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. మొయినాబాద్– అమీర్‌గూడ రోడ్డులో అడుగుకో గుంత ఏర్పడింది. పెద్దమంగళారం–చందానగర్ రోడ్డుపై వెళ్లడానికే వాహనదారులు, స్థానికులు జంకుతున్నారు. సురంగల్–శ్రీరాంనగర్ రోడ్డుపై వర్షం నీరు నిలిచి గుంతలు ఏర్పడి బురదమయంగా మారింది. అజీజ్‌నగర్ ఎస్సీ కాలనీ వద్ద రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డు ఇళ్ల మధ్యలోనుంచే ఉండటంతో వాహనదారులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.