మూగజీవాలు భద్రం | - | Sakshi
Sakshi News home page

మూగజీవాలు భద్రం

Aug 18 2025 8:18 AM | Updated on Aug 18 2025 8:18 AM

మూగజీ

మూగజీవాలు భద్రం

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త

అప్రమత్తత తప్పనిసరి

లేదంటే పశుసంపదకు ముప్పు

పశువైద్యాధికారి విశ్వనాథం

నవాబుపేట: వానాకాలం సీజన్‌లో మనుషులకే కాదు.. మూగజీవాలకు వ్యాధుల ముప్పు తప్పదు. ఈ కాలంలో పశువులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా గొంతువాపు, జబ్బవాపు తదితర రోగాలు చుట్టుముడతాయి. ఈగలు, దోమల దాడి పెరుగుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు యాజమాన్య చర్యలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వాటి జీవన స్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని, ఎలాంటి వ్యాధి సోకినా వెంటనే వైద్య చికిత్స అందించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్‌ విశ్వనాథం రైతులకు సూచిస్తున్నారు. కాగా మండలంలో ఆవులు, ఎడ్లు 4,232 ఉండగా.. గేదెలు 1,162, గొర్రెలు 3,573, మేకలు 7,874 ఉన్నాయి.

గాలికుంటు

గాలికుంటు వ్యాధి సోకిన పశువు చాలా బలహీనంగా ఉంటుంది. పాడి పశువులు నీరసించి పోతుంటాయి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. సాగు పనులకు ఎడ్లు సహకరించవు. సంకరజాతి పశువులతో పాటు షెడ్‌లలో పెంచుకునే వాటికి ఈ రోగం వ్యాపిస్తుంటుంది. ఎక్కువగా మార్చి, ఏప్రిల్‌,సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో సోకే ప్రమాదం ఉంది. వ్యాధి బారిన పడిన పశువులకు నోరు, గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3,4 వారాల్లోబొబ్బలు పగిలి పుండ్లుగా మారుతాయి. చర్మం గరుకుగా మారుతుంది. నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడి మేత తీసుకోలేక నీరసించిపోతాయి. నోటి నుంచి సొంగ కారుతుంది.

జబ్బవాపు

వయసులో ఉన్న ఆరోగ్య వంతమైన పశువులు, తెల్లజాతి పశువులకు ఈ జబ్బవాపు వ్యాధి సంక్రమిస్తుంటుంది. ఇది సోకిన పశువు అధిక జ్వరంతో బాధపడుతుంది. మేత మేయదు. నిత్యం పడుకొనే ఉంటుంది. జబ్బభాగం వాచి, నల్లగా కములుతుంది. అక్కడ కండరాలు ఉబ్బుతాయి. వాటిలో గాలి బుడగలు, నీరు చేరి తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతుంటుంది. వాపు ఉన్నచోట చేతితో తాకితేగరగరమని శబ్దం వస్తుంది. సకాంలో వైద్యం అందించకపోతే పశువు నీరసించి, చనిపోతుంది. సకాలంలో సూదిమందు, గ్లూకోజ్‌ ద్రావణాన్ని అందించాలి. ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకా వేయిస్తే మేలు.

గొర్రెల్లో కాలిపుండ్లు

వర్షాకాలంలో గొర్రెలు బురదలో తిరగడం వలన కాలిపుండ్ల వ్యాధి సోకుతుంది. గిట్టల మధ్య చర్మం మెత్తబడి, వాచి చిట్లుతుంది. చీముపట్టి నొప్పితో ముందుకాళ్లపై గెంటుతాయి. వ్యాధి ముదిరితే గిట్ట లూడిపోతాయి. ఇది సోకిన జీవాలకు 10 శాతం మైలతుత్తం, పదిశాతం జింక్‌సల్ఫేట్‌, లేదంటే ఐదుశాతం ఫార్మలిన్‌లో ఏదైనా ఒక ఆయిట్‌మెంట్‌ పూయాలి. యాంటిబయాటిక్‌ ఇంజెక్షన్‌ వరుసగా 3–5 రోజుల పాటు వేయించాలి. గొర్రెలను బురద నేలల్లో ఎక్కువగా తిరగనియొద్దు.

గురక వ్యాధి

ప్రస్తుత కాలంలో పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు(గురక) ఒకటి. ముఖ్యంగా వయసులో ఉన్న వాటికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని బారిన పడిన వాటికి అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తుంది. మేత మేయదు. గొంతుపై, మెడ కింద వాపు కన్పిస్తుంది. ఆయాసపడుతూ శ్వాస పీల్చుకుంటుంది. ఆ సమయంలో గురక శబ్దం వస్తుంది. నోరు, ముక్కు నుంచి ద్రవం కారుతుంది. వణుకుతూ ఉంటుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. పాడి పశువుల్లో పాలదిగుబడి తగ్గుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువ అయితే ఎడతెరపి లేకుండా దగ్గుతూ, అపస్మారక స్థితికి వెల్లి చనిపోతుంది.

దోమలు దాడి చేస్తే..

నేల చిత్తడిగా ఉండి, వాతావరణం అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో నీరు నిల్వ ఉన్న గుంతలు, మురుగునీటి కాల్వల్లో ఈగలు, దోమలు ఆవాసాన్ని ఏర్పర్చుకుంటాయి. ఇవి ఆహారం కోసం పశువులపై దాడి చేస్తుంటాయి. ఈ సీజన్‌లో వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది. పశువుల శరీరంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి. తద్వారా పశువులు మేత సరిగా మేయవు, నిద్ర పోవు. ఫలితంగా అవి రక్తహీనతకు గురవుతాయి. ఈగలు, దోమ కాటు వలన పశువు శరీరంపై పుండ్లు ఏర్పడతాయి. అందుకు పశువుల పాకలు, నిల్వ ఉన్న ప్రదేశాల్లో కిరోసిన్‌ను పిచికారీ చేయాలి. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎండుపిడుకలు, వేపాకుతో పొగపెడితే ఈగలు, దోమలు తగ్గుతాయి.

లేత గడ్డి ప్రమాదం

తొలకరి జల్లులకు మొలిచే లేత గడ్డి మొక్కలను పశువులు అతిగా తింటుంటాయి. అయితే ఆ గడ్డిలో హైడ్రో ౖసైనెడ్‌ విష పదార్థం ఉంటుంది. దీనిని మేసిన 15 నిమిషాలకే పశువుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వెంటనే తగిన చికిత్స చేయించకపోతే అది మృత్యువాత పడే ప్రమాదంఉంది. కాబట్టి రైతులు పశువులకు లేత గడ్డిని మేతగా వేయవద్దు. తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మూగజీవాలు భద్రం 1
1/1

మూగజీవాలు భద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement