
కూలీ మృతిపై కేసు నమోదు
కేశంపేట: విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందిన ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేశంపేటలో నిర్మిస్తున్న పోశమ్మ దేవాలయ పనులు చేసేందుకు తమిళనాడుకు చెందిన రాజుకు కాంట్రాక్టుకు ఇచ్చారు. అతడి వద్ద అదే రాష్ట్రానికి చెందిన విజయబాలన్ కృష్ణన్ (45) కూలి పనులు చేసేందుకు వచ్చాడు. శుక్రవారం పనులు చేస్తుండగా దేవాలయం పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలాయి. గమనించిన తోటి పనివారు చికిత్స నిమిత్తం కేశంపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విజయబాలన్ కృష్ణన్ మృతి చెందాడు. ఈ విషయమై శనివారం కాంట్రాక్టర్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన మారమోని శివకుమార్(21) స్థానిక వైన్స్‌లో పనిచేస్తున్నాడు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన బంధువు బోళ్ల మల్లేశ్ శుక్రవారం మైసిగండిలో నిర్వహించిన ఫంక్షన్‌లో శివకుమార్ పాల్గొన్నాడు. ఫంక్షన్ ముగిసిన అనంతరం అదే రాత్రి తలకొండపల్లిలోని బంధువుల ఇంటికి వారి వెంట తన బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో చల్లంపల్లి సమీపంలో బైక్‌పై నుంచి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కడ్తాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుడి సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యువకుడి నేత్రాలను కుటుంబసభ్యులు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అందజేశారు.
యువకుడి అదృశ్యం
కేశంపేట: యువకుడు అ దృశ్యమైన సంఘటన మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి శివారులోని వాల్యతండాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగడ్డతండా పంచాయతీ పరిధిలోని దేవునిగుడితండాకు చెందిన లక్ష్మణ్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి కొండారెడ్డిపల్లి శివారులోని వాల్యతండాలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు ముడావత్ శ్రీనివాస్ చదువు మధ్యలో ఆపేసి వ్యవసాయ పనులు చేస్తూ ఇంటి వద్దే ఉంటున్నాడు. శుక్రవారం కుమారుడు ఇంటి వద్ద ఉండగా తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చారు. కుమారుడు కన్పించకపోవడంతో చుట్టపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.