
రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి
ఏడీఏ శంకర్ రాథోడ్
దుద్యాల్: భూమి ఉన్న ప్రతి ఒక్కరూ రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్ సూచించారు. మంగళవారం మండలంలోని హకీంపేట్ రైతు వేదికలో అన్నదాతల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. 14–08–1966 నుంచి 14–08–2007 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. ఆధార్ కార్డు, పట్టాపాసు పుస్తకం, బ్యాంక్ ఖాతా పుస్తకం, నామినీ ఆధార్ కార్డు, నామినీ బ్యాంక్ అకౌంట్ పుస్తకంతో స్థానిక ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. అనంతరం మండలంలోని ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి నాగరాజు, ఏఈవో మాణికేశ్వరి, రైతులు పాల్గొన్నారు.
దుద్యాల్ ఆయుర్వేదిక్ వైద్యుడిగా సుశీల్ కుమార్
దుద్యాల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆస్పత్రి వైద్యుడిగా సుశీల్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదంలో పలు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి వివిధ రకాల చికిత్సలు చేయనున్నట్లు వివరించారు. ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
డీఈఓ రేణుకాదేవి
అనంతగిరి: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. ఏకల్, గ్రామోథన్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో 400 మంది మహిళలు 90 రోజుల పాటు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలో శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. 90 రోజుల్లో కంప్యూటర్, బ్యుటీషియన్, కుట్టు తదితర శిక్షణ పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు ప్రభాగ్, రాజేందర్, శ్రీధర్‌రెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు విద్యార్థుల ఎంపిక
అనంతగిరి: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఒకటవ తరగతి ప్రవేశం కోసం లాటరీ పద్ధతిన ఎస్టీ విద్యార్థులను ఎంపిక చేశారు. 2025 – 26 సంవత్సరానికి నలుగురు విద్యార్థులను అదనపు కలెక్టర్ సుధీర్, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అభివృద్ధి కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. హర్ష వర్ధిని సాయి అన్గోత్, విస్లావాత్ ప్రతిక్ష, కట్రావాత్ వైభవ్, పాత్లవత్ అభినందన్ ఎంపికై నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు సుందర్ రాజు, ఎస్ విక్రం సింగ్ తదితరులు పాల్గొన్నారు.

రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి