పోటెత్తిన వరద
వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు రోజుల క్రితం ప్రారంభమైన వాన ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరింత ఉధృతంగా మారింది. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. బుధవారం రోజంతా భారీ వర్షం పడింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. యెరువులకు గండ్లు పడ్డాయి. జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. వాగులు పోటెత్తడంతో ఆయా మార్గాల్లోని వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిగి పట్టణంలో అత్యధికంగా 127 మిల్లీ మీటర్లు, దోమలో 118.5, పూడూరులో 97.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ ప్రతీక్‌జైన్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. గురువారం ఎస్పీ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్‌తో కలిసి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు.
జిల్లాలో 1,187 చెరువులు ఉండగా చాలా వరకు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం 311 అలుగు పారుతుండగా మరో 294 పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువయ్యాయి. కాలువలు సరిగ్గాలేని, ఆక్రమణలకు గురైనా చెరువులు మాత్రం నిండలేదు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. లఖ్నాపూర్, కాకరవాణి, నందివాగు, అల్లాపూర్ , శివసాగర్, సర్పన్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టులు అలుగు పారుతున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు వరద ఉధృతి ఉంటుందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
● జిల్లాలోని కాగ్నా, మూసీ, ఈసీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆయా మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
● ధారూరు మండలం దోర్నాల, రుద్రారం, నాగసముందర్, పరిగి వాగు, గొడుగోనిపల్లి, గెర్‌గేట్‌పల్లి, ధన్నారం మార్గాల్లో వాగులు బ్రిడ్జల పైనుంచి ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు బందయ్యాయి. బంట్వారం మండలంలోని నూర్లపూర్ వాగు పొంగిపొర్లుతోంది.
● ధారూరు మండలం గురుదొట్ల చెరువుకు గండి పడటంతో నీరంతా పంట పొలాల్లోకి చేరింది. అప్రమత్తమైన అధికారులు గండిని పూడ్చారు.
● తాండూరు నియోజకవర్గంలో భారీ వర్షాలకు కగ్నా పరవళ్లు తొక్కుతోంది. బషీరాబాద్, యాలాల, తాండూరు మండలాల్లో పలు చోట్ల కగ్నా ఉధృతికి రాకపోకలు ఆగిపోయాయి.
● జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు.
● వికారాబాద్, తాండూరు, పరిగి పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధుల్లో నడిచే పరిస్థితి లేకుండా పోయింది.
భారీ వర్షాలు పడతాయన్న ముందస్తు హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందిని సమాయత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ప్రమాదకర స్థలాలను గుర్తించి రెవెన్యూ, పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
అన్ని చర్యలు తీసుకున్నాం
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకున్నాం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పా టు చేశాం. అత్యవసర సేవలు అవసరమైన వారు సెల్ నంబర్ల 7995061192, 08416235291లో సంప్రదించాలి. జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.
– ప్రతీక్‌జైన్, కలెక్టర్
బందోబస్తు ఏర్పాటు చేశాం
అత్యవసర సేవల కోసం డయల్ 100కు కాల్ చేయాలి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు వాగులు దాటే ప్రయ త్నం చేయరాదు. శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో ఉండరాదు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు ఒరిగినా, వైర్లు తెగి పడినా సమాచారం ఇవ్వాలి.
– నారాయణరెడ్డి, ఎస్పీ
జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం
నిండుకుండల్లా ప్రాజెకులు
వాగులు ఉగ్రరూపం
అప్రమత్తమైన యంత్రాంగం
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
పరిగిలో అత్యధికంగా 127 మిల్లీ మీటర్లు నమోదు
నీట మునిగిన పంటలు
కొట్టుకుపోయిన రోడ్లు
పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
వరద ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు