
అప్రమత్తంగా ఉన్నాం
● భారీ వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం
● కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: జిల్లాలో అతి భారీ వర్షం కురిసినా సమర్థవంతంగా ఎదుర్కొంటాం.. అందుకు అధికారులను సమాయత్తం చేశామని కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. గురువారం నగరం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం కొడంగల్‌లో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. లోత్తట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పర్యాటక ప్రాంతాలను మూసివేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్‌ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.
పరిహారం అందేలా చూస్తాం
తాండూరు: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట వివరాలు సేకరించి రైతులకు పరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గంలోని వరద ప్రాంతాలను ఎస్పీ నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందరాదని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
బొంరాస్‌పేట: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. గురువారం మండలంలోని బొంరాస్‌పేట పెద్ద చెరువు అలుగును, నిర్మాణంలోని వంతెనను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ వెంట సీఐ శ్రీధర్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.